రేపటి నుండి బ్రహ్మోత్సవాలు
* మే 1న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం
మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామం శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు రేపటి ( సోమవారం ) నుండి ప్రారంభం కానున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 నుండి మే 6 వ తేది వరకు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 27న అంకురార్పణ, ఏప్రిల్ 28న గరుడాధివాసం, ఏప్రిల్ 29న ధ్వజారోహణం, ఏప్రిల్ 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, మే 2న రథోత్సవం, మే 3న సదస్యం, మే 4న తెప్పోత్సవం, దోపోత్సవం, మే 5న నాగవెల్లి, మే 6న వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం చలువ పందిర్లు, త్రాగునీరు , వైద్య వైద్యశిబిరం తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.






