గోవిందా.. గోవిందా
*ఉద్ధాలు ఉత్సవానికి భక్తజన సంద్రం..
*పల్లమర్రి నుంచి చాట, వడ్డేమాన్ నుంచి పాదుకల ఊరేగింపు
*బండెనుక బండి కట్టి.. పల్లె జాతరకు పయనం
*స్వామివారి పాదుకులకు ఎమ్మెల్యే, బాలల హక్కుల చైర్మన్ పూజలు
*ఉద్దాలను తాకేందుకు పోటీపడ్డ భక్తజనం
*పచ్చిపులుసు, పరమాన్నంతో స్వామికి నైవేద్యం
*ఉద్దాల ఉత్సవానికి భారీ బందోబస్తు
చిన్న చింతకుంట: పల్లె ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. స్వామి వారి ఉద్దాల ఉత్సవాన్ని తిలకించేందుకు పల్లె ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వడ్డేమాన్ లోని ఉద్దాల మండపం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం పల్లమర్రిలోని మేదరులు నియమనిష్టలతో తయారుచేసిన చాటకు స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో చాట ఊరేగింపు కొనసాగింది. అక్కడ అందంగా అలంకరించిన ట్రాక్టర్ ఫై చాట నుంచి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా లాల్ కోట గ్రామానికి చేరుకుంది.
లాల్ కోటలో ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికి కురువడోల్ల చప్పుళ్లతో ఊరేగింపు కొనసాగింది. అనంతరం నెల్లి కొండి గ్రామానికి చాట చేరుకోగానే ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా వడ్డెమాన్ లోని ఉద్దాల మండపానికి చేరుకోగానే చాటను ఉద్దాల మండలంలో ఉంచారు. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఉద్దాల మండప ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి పాదుకలను తాకేందుకు భక్తులు క్యూ లైన్ లో నిలుచుని ఉద్దాలను దర్శించుకున్నారు. అనంతరం చాటలో స్వామివారి పాతుకలను దళితులు మండపం ముందు అరుగుపై ఉంచారు.
అప్పటికే స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత శ్రీహరి ,దేవస్థాన చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, కొత్తకోట సిద్ధార్థ రెడ్డి నేహా రెడ్డి మాజీ జెడ్పిటిసి వట్టెం రాజేశ్వరి రాము మాజీ ఎంపీటీసీ వట్టెం స్వప్న శివకుమార్, పాలకమండలి సభ్యులతోపాటు నెల్లి వంశీయులు స్వామివారి పాదుకలు రాగానే నెల్లివంశీయులు తొలి పూజ పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే తో పాటు కమిషన్ చైర్మన్ సీతమ్మ పూజలు నిర్వహించారు. స్వామివారి ఉద్దాల చాటను తలపై ఉంచుకునేందుకు పోటీ పడ్డారు. అక్కడి నుంచి నేరుగా సమీపంలోని ఊకచెట్టు వాగులోకి స్వామివారి పాదుకలను పోలీసుల బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులను వరుస క్రమంలో కూర్చోబెట్టి స్వామివారి పాదుకులను వారి తలపై నుంచి తీసుకెళ్తూ స్వామివారి పాదుకులను తాకి భక్తులు పునీతులయ్యారు.
అక్కడ వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఊకచెట్టు వాగు లో ఉద్దాల వేడుకలు తిరునాళ్లను తలపించింది. అక్కడి నుంచి దళితులు పోలీసు బందోబస్తు మధ్య అప్పంపల్లి చిల్లబాట నుంచి స్వామి వారి పాదుకల ఊరేగింపు కొనసాగింది. తిరుమలాపూర్ గ్రామానికి రాగానే స్వామివారి పాదుకలకు భక్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేర్చారు. అక్కడ స్వామివారి ఉద్దాలకు ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం అందమైన పూలతో అలంకరించిన ట్రాక్టర్ పై స్వామివారి పాదుకలను ఉంచి ఊరేగింపుగా జాతర మైదానంలోని ఉద్దాల గుండు వద్దకు రాగానే అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పాటు శివసత్తుల నాట్యా లతో స్వామివారి పాదుకులకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామి వారి పాదుకల ఊరేగింపు కొనసాగింపులో పోలీసులు నానా అవస్థలు పడ్డారు. నెమలిపించాలతో వచ్చిన శివసతులను అదుపు చేయడంలో పోలీసులు నానా తంటాలు పడ్డారు.
భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు పులకరించాయి. స్వామివారి పాదుకలను కొండ దిగువన జాతర మైదానానికి రాగానే పెద్ద ఎత్తున బాణా సంచాను కాల్చారు. అనంతరం స్వామివారి పాదుకలను ముఖ్య అతిథులు దర్శించుకున్న అనంతరం స్వామి వారి ఉద్దాలను ఉంచిన ట్రాక్టరు మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి పాదుకలను కొండపై గల స్వామివారి ప్రధానాలయానికి చేర్చారు. అక్కడ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి పాదు కులను ఉద్దాల మండపానికి చేర్చారు. అనంతరం భక్తులు స్వామివారి పాదుకులను దర్శించుకున్నారు .. స్వామివారి ఉద్దాల ఊరేగింపు కు జిల్లా ఎస్పీ జానకి ,డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు..ముసురు వర్షం కారణంగా భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు..
దాసంగాలతో.. స్వామికి మొక్కులు
శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం రోజున స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పల్లె జాతరకుఇతర రాష్ట్రాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల, పల్లె ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో జాతరమైదానం భక్త జనసంద్రంగా మారింది.. స్వామివారికి కొత్త మట్టి కుండలో పచ్చిపులుసు, పరమాన్నంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
బండెనుక బండి కట్టి..
శ్రీ కురుమూర్తి స్వామి జాతర పల్లె జాతరగా పేరుగాంచింది. పల్లె ప్రాంత ప్రజలుశ్రీ వెంకటేశ్వరుడి ప్రతిరూపంగా శ్రీ కురుమూర్తి స్వామిని కొలుస్తారు. ఉద్దాల మహోత్సవం రోజున స్వామివారికి దాసంగాలతో నైవేద్యం సమర్పించేందుకుగాను పల్లె ప్రాంతాల నుంచి బండెనుక బండి కట్టి.. కురుమన్న జాతరకు వెళ్దాం పదా అంటూ పల్లె ప్రజలు ఎడ్లబండ్లతో కురుమయ్య జాతరకు తరలివచ్చారు.
గరుడ వాహనంపై ఊరేగిన కురుమూర్తి స్వామి
శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత కురుమూర్తి స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.. స్వామివారి ప్రధానాలయం లో అందమైన పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివారిల ఉత్సవ విగ్రహలను ఉంచి వేతపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి ప్రధానాలయం నుంచి స్వామి వారి పుష్కరిణి వరకు చిన్న చింతకుంట దాసులు పలకి సేవ మాడా వీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామస్మరణలతో కురుమతిగిరులు పులకరించాయి..






