15 April, 2026 | 3:19 AM

ఆధునిక హంగులతో గరిడేపల్లి పోలీస్ స్టేషన్..

28-10-2025 10:04 PM

అత్యధికంగా గరిడేపల్లి మండల కేంద్రంలో 57 సీసీ కెమెరాలను ఏర్పాటు

- నేడు గరిడేపల్లికి ఎస్పి రాక...

- గరిడేపల్లి మండల కేంద్రంలో మూడు ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించాము

- గరిడేపల్లి స్టేషన్ పనులను పరిశీలించిన సీఐ చరమందరాజు

- సర్కిల్ పరిధిలో 200 సీసీ కెమెరాలు

- సేఫ్ జోన్ దిశగా హుజూర్నగర్ సర్కిల్

గరిడేపల్లి (విజయక్రాంతి): సేఫ్ జోన్ దిశగా హుజూర్నగర్ సర్కిల్ ను తీర్చిదిద్దుతున్నట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఆధునికరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను క్రైమ్ రేట్ తగ్గే విధంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాలకు అనుగుణంగా సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల శివారులో సుమారు 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం 60 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని మిగిలిన 40 సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మఠంపల్లి మండల కేంద్రంలో 35 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అదనంగా మరో 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 57 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పాలకవీడు మండలంలో 35 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో 10 కెమెరాలు పనిచేస్తున్నాయని వాటితో పాటు అదనంగా 25 సీసీ కెమెరాలు నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.నేరేడుచర్ల పట్టణంలో 40 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా మరో 25 కెమెరాలు అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ శాఖ ఆర్థిక సహాయంతో హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా దాతల సహకారంతో అదనంగా 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో 200 సీసీ కెమెరాలతో సేఫ్ హుజూర్నగర్ గా మారనున్నట్లు వివరించారు.సీసీ కెమెరాలతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలను నివారించే విధంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా గరిడేపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న యూటర్న్ మూసి వేయటం జరిగిందన్నారు. ఈ యూటర్న్ వద్ద ఇటీవల అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుని కొంతమంది చనిపోయారని ఆయన గుర్తు చేశారు.

గరిడేపల్లి మండలంలో మూడు ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించామని అత్యధికంగా ప్రమాదాలు జరిగిన ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా చూస్తామని ఆయన తెలిపారు. ఈ మూడు హాట్ స్పాట్ ల ప్రాంతాల్లో స్టాపర్స్తో జిగ్ జాగ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిసి కెమెరాలతో హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో నేరాలను నియంత్రించి అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండల కేంద్రాల్లోనే కాకుండా మఠంపల్లి మండల పరిధిలోని రఘునాధపాలెం, పెదవీడు, బిల్ నాయక్ తండ గ్రామంలో అదనంగా 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ఎస్ఐ చలికంటి నరేష్ కృషి చేశారని తెలిపారు. పోలీస్ స్టేషన్లో అదనంగా రెండు ప్రత్యేక రూములను ఏర్పాటు చేయడమే గాక,స్టేషన్ ఆవరణలోని గ్రౌండ్ ను ప్రత్యేకంగా స్టేషన్కు వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా రూపొందించినట్లు తెలిపారు.

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ను బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు అధికారులు చేపడుతున్న వివిధ పనులకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను ఆ మండల ప్రజలందరూ వారి పోలీస్ స్టేషన్ గా గుర్తించాలని ఆయన కోరారు. అధికారులు ఉద్యోగాల నిమిత్తం పోలీస్ స్టేషన్లకు వస్తారని కొన్ని నెలల తర్వాత బదిలీపై వెళ్తారని, పోలీస్ స్టేషన్ మాత్రం ఆ మండల ప్రజలకు శాశ్వతమైనదని తెలుసుకోవాలన్నారు. ప్రజల రక్షణ కోసం, నేరాల నియంత్రణ కోసం పోలీసు అధికారులు తీసుకునే చర్యలకు ,నిర్ణయాలకు ఆయా మండల ప్రజలు దాతలు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.