ఘనంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి
కలశాల ఊరేగింపు, ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో వైశ్య మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. కలశాల ఊరేగింపును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు.
ఆదివారం వాసవి మాత జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, వాసవి యువజన సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రతినిధులు, మహిళా విభాగం, ఆధ్వర్యంలో గోపూజ, సామూహిక వాసవి పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు కన్యక పరమేశ్వరాలయంలో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 51 గల్లీల నుంచి మహిళలు సామూహికంగా కలశాల ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం ఆలయం ఆవరణలో కలశాభిషేకం, పంచామృత అభిషేకాలు చేసి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
వాసవి మాత చూపిన అహింస మార్గం, ధర్మరక్షణ, త్యాగనిరతి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజసేవలో వైశ్యులు ముందుండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు భూమేష్ , శ్రీనివాస్, లింగం, చిలువేరి మారుతి,ఉప్పల హరిధర్, జూలూరి సుధాకర్, కొక్కొండ శ్రీనివాస్, సుదర్శన్,ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






