సర్కారు వారి అప్పుల బాట

05-10-2026 | 05:30am

నెలనెలా పెరిగిపోతున్న రాష్ట్ర రుణాలు

  1. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.58,458.71 కోట్లు..ఆరు నెలల్లోనే 80% పూర్తి
  2. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి రూ. 46,400 కోట్లు
  3. ఈ నెల 7న మరో రూ.2,500 కోట్ల సమీకరణ
  4. డిసెంబర్ నాటికి 59,400 కోట్లకు చేరే చాన్స్
  5. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు అప్పులే దిక్కు
  6. ఈసారి పాత అప్పుల కిస్తీలకే రూ. 21,304 కోట్లు
  7. చివరి త్రైమాసికంలోనూ రుణాలు తప్పని పరిస్థితి

అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ(State Government) ఆర్థిక వ్యవహా రాల్లో అప్పుల భారం మరోసారి చర్చకు దారితీసింది. సంక్షేమం, అభివృద్ధి ప్రాజెక్టులకు, పాత అప్పుల కిస్తీలకు నెల నెలా రుణాలు తీసుకుంటూ పోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026 ప్రారంభమైన ఆరు నెలల్లోనే మొత్తం లక్ష్యంలో 80శాతం మేరకు అప్పులు సమీకరించుకుంది. ఏప్రిల్ మొదలు సెప్టెంబర్ వరకు రూ. 46,400 కోట్ల రుణాలు తీసుకుంది.

అక్టోబర్ 7న మరో రూ. 2,500 కోట్లు తీసుకోనుంది. 2026 రాష్ట్ర మార్కెట్ రుణాల వార్షిక(Annual state market borrowings) లక్ష్యం రూ.58,458.71 కోట్లు. కానీ, డిసెంబర్ నాటికే మార్కెట్ రుణా లు రూ. 59,400 కోట్లకు చేరి, వార్షిక లక్ష్యాన్ని  కూడా సుమారు రూ. 941 కోట్ల మేర దాటే అవకాశం ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. మిగిలిన జనవరి త్రైమాసికంలోనూ ప్రభుత్వం మరిన్ని రుణాలు తీసుకునే అవసరం ఉంటుందని అంచనా. 

ఇలా.. అప్పుల మీద అప్పులు పెరిగిపోతుండ టం.. అవి రోజువారీ నిర్వహణ వ్యయా లు, ఆదాయం రాని ఖర్చుల కోసం వాడుతుండటంతో భవిష్యత్ తరాలపై రుణభారం పెరిగిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఆదాయం సృష్టించే ఆస్తుల నిర్మాణానికి అప్పులను వినియోగిస్తే భవిష్యత్తులో ఆ పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.  

ఈనెల 7న మరో రూ. 2,500 కోట్లు..

2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మార్కెట్ రుణాల వార్షిక లక్ష్యం రూ. 58,458.71 కోట్లుగా ఉంది. అక్టోబర్ నాటికే ఆ లక్ష్యంలో దాదాపు 84 శాతం చేరుకోనుంది. ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు భారీ మొత్తాల్లో రుణాలు సమీకరిస్తూ వస్తున్నది. ఏప్రిల్ 7న రూ. 3,900 కోట్లు, ఏప్రిల్ 21న రూ. 3,000 కోట్లు తీసుకుంది. మే 5న రూ. 4,000 కోట్లు, మే 19న రూ. 2,000 కోట్లు సమీకరించింది. జూన్ 2న మరో రూ. 4,000 కోట్లు, జూన్ 16న రూ. 2,000 కోట్ల రుణం తీసుకుంది.

జూలైలో రుణాల పరిమాణం మరింత పెరిగింది. జూలై 1న ఏకంగా రూ. 7,000 కోట్లు, జూలై 7న రూ. 3,000 కోట్లు, జూలై 14న రూ. 2,500 కోట్లు, జూలై 28న రూ.1,000 కోట్లు సమీకరించింది. ఆగస్టు 4న రూ. 2,500 కోట్లు, ఆగస్టు 18న రూ. 2,000 కోట్లు తీసుకుంది. సెప్టెంబర్‌లోనూ ఇదే ధోరణి కొనసాగింది.

సెప్టెంబర్ 1న రూ. 2,000 కోట్లు, సెప్టెంబర్ 15న రూ. 7,500 కోట్లు సమీకరించింది. అక్టోబర్ 7న మరో రూ. 2,500 కోట్ల రుణం తీసుకోనుండటంతో మొత్తం మార్కెట్ రుణాలు రూ.48,900 కోట్లకు చేరనున్నాయి. సెప్టెంబర్ 15న తీసుకున్న రూ. 7,500 కోట్ల రుణాన్ని నాలుగు సెక్యూరిటీల ద్వారా సమీకరించినట్లు రుణ మార్కెట్ వివరాలు వెల్లడిస్తున్నాయి.

మొదటి ఆరు నెలల్లోనే భారీగా..!

2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్‌ెొన్‌లోనే ప్రభుత్వం రూ.18,900 కోట్ల రుణాలు సమీకరించింది. జూలైన త్రైమాసికంలో మరో రూ. 27,500 కోట్లు సమీకరించింది. దీంతో రెండు త్రైమాసికాలు పూర్తయ్యే సమయానికే రూ. 46,400 కోట్ల మార్కెట్ రుణాలు తీసుకున్నట్టయింది. అక్టోబర్ 7న ప్రతిపాదించిన రూ. 2,500 కోట్లతో ఈ మొత్తం రూ.48,900 కోట్లకు చేరుతుంది.

అంటే ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ప్రభుత్వం తన వార్షిక మార్కెట్ రుణ లక్ష్యంలో దాదాపు 80 శాతం వరకు వినియోగించింది. దీంతో మిగిలిన నెలల్లో ప్రభుత్వ ఆర్థిక అవసరాలు ఎలా నెరవేరుతాయన్నది కీలకంగా మారింది. ఇక్కడే అసలు ఆర్థిక ఒత్తిడి కనిపిస్తున్నది. 2026 రాష్ట్ర మార్కెట్ రుణాల వార్షిక లక్ష్యం రూ.58,458.71 కోట్లు. కానీ అక్టోబర్ 7 నాటికి రూ.48,900 కోట్లకు చేరనున్న రుణాలకు తోడు అక్టోబర్‌లోనే మరోసారి రూ. 2,000 కోట్లు, నవంబర్‌లో రూ. 4,500 కోట్లు, డిసెంబర్‌లో రూ. 4,000 కోట్ల రుణాలను సమీకరించే ప్రతిపాదనలు ఉన్నాయి.

దీంతో డిసెంబర్ నాటికే మార్కెట్ రుణాలు రూ. 59,400 కోట్లకు చేరి, వార్షిక లక్ష్యాన్ని  కూడా సుమారు రూ. 941 కోట్ల మేర దాటే అవకాశం ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. మిగిలిన జనవరిమార్చి త్రైమాసికంలోనూ ప్రభుత్వం మరిన్ని రుణాలు తీసుకునే అవసరం ఉంటుందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ధోరణిని పరిగణనలోకి తీసుకుంటే చివరి త్రైమాసికంలో మరో రూ.10 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. 

పాత అప్పుల కిస్తీలకు, అభివృద్ధి పనులకు అప్పులే ఆధారం..

 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 79,984 కోట్ల స్థూల రుణ సమీకరణను అంచనా వేసింది. ఇందులో మార్కెట్ రుణాలతో పాటు కేంద్ర రుణాలు, ఇతర మార్గాల్లో తీసుకునే రుణాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 58,459 కోట్లుగా, జీఎస్డీపీలో 3 శాతంగా అంచనా వేశారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రభుత్వం రూ. 3.01 లక్షల కోట్ల నికర వ్యయాన్ని భరించాల్సి ఉంది. దీనికి రూ. 2.42 లక్షల కోట్ల నికర రాబడులు, మిగిలిన మొత్తానికి రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే రాష్ట్ర వ్యయ అవసరాలకు రుణాలు కీలక ఆర్థిక వనరుగా మారుతున్నాయి. 

n2026 ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వం సుమారు రూ. 50,713 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ విశ్లేషణలు పేర్కొంటున్నాయి. ఇందులో రైతు భరోసా, చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి తదితర పథకాలకు భారీగా నిధులు అవసరం. మరోవైపు మూలధన వ్యయాన్ని పెంచే లక్ష్యంతో రూ. 47,267 కోట్ల కేటాయింపు చేశారు. అయితే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు వంటి నిర్బంధ వ్యయాలను సమన్వయం చేయాల్సిన పరిస్థితిలో రుణాలపై ఆధారపడటం పెరుగుతున్నది. 

nబడ్జెట్ ప్రకారం పాత అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే  2026 సుమారు రూ.21,304 కోట్లు అవసరమవుతాయి. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడం సాధారణ ఆర్థిక విధానమే. అయితే, రుణాలను ఆదాయం సృష్టించే ఆస్తుల నిర్మాణానికి వినియోగిస్తే భవిష్యత్తులో ఆ పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కానీ.. రోజువారీ నిర్వహణ వ్యయాలు, ఆదాయం రాని ఖర్చుల కోసం అప్పులపై ఎక్కువగా ఆధారపడితే భవిష్యత్ తరాలపై రుణభారం పెరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. 

మరింత అప్పు తప్పదా?

ప్రస్తుత రుణ సమీకరణ వేగాన్ని చూస్తే చివరి త్రైమాసికంలోనూ ప్రభుత్వం అప్పుల మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు త్రైమాసికాల్లోనే రూ.46,400 కోట్ల రుణాలు సమీకరించిన నేపథ్యంలో మిగిలిన నెలల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాత అప్పుల చెల్లింపులు, వడ్డీ భారాన్ని ఎలా నిర్వహిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక నిర్వహణలో అప్పులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రుణాల మొత్తం ఎంతవరకు చేరుతుంది? అదనపు రుణాలకు అనుమతులు ఎలా లభిస్తాయి? కొత్త అప్పుల్లో ఎంత మొత్తం మూలధన వ్యయానికి, ఎంత మొత్తం రెవెన్యూ అవసరాలకు వెళ్తుంది? భవిష్యత్ ఆదాయంతో ఈ అప్పులను ఎలా తిరిగి చెల్లిస్తారు? అనే  ప్రశ్నలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి రాజకీయంగానూ చర్చ జరుగుతుంది.

ప్రభుత్వం మాత్రం సంక్షేమం, అభివృద్ధి కోసం నిధులు సమీకరిస్తున్నామని చెప్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం బడ్జెట్ నిర్వహణ మొత్తం అప్పులపైనే ఆధారపడుతున్నదని  విమర్శించే అవకాశం ఉంది. అయితే.. అప్పు ఎంత తీసుకున్నారు అనేదానికంటే, ఆ అప్పును ఏ రంగంలో ఖర్చు చేశారు, దాని ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం లేదా ఆస్తి సమకూరింది అనే అంశంపైనే చర్చ ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు