ఒలింపిక్ ఎన్నికలపై యధాతధస్థితి: హైకోర్టు
హైదరాబాద్, మే 30, విజయక్రాంతి: భారత ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియపై యధాతధస్థితిని కొనసాగించాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా ఓటర్ల జాబితా తయారీపై పలు అసోసియేషన్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని భారత, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఆదేశాలు జారీ చేసిం ది. భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు జరుగనున్న ఎన్నికల్లో తమ సంఘం ప్రతినిధుల పేర్లు తొలగించడాన్ని సవాలు చేస్తూ తెలంగా ణ స్క్వాష్ రాకెట్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్, తైక్వాండో అసోసియేషన్, అమెచ్యూర్ ఉషు, కనోయింగ్, కయాకింగ్ తదితర అసోసియేషన్లు హైకోర్టును ఆశ్రయించాయి. అసోసియేషన్ల పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంలో ఒలింపిక్ సంఘం నిబంధనలను ఉల్లంఘించిందని వాదనలు వినిపించారు. దీంతో న్యాయమూర్తి ఎన్నికల నోటిఫికేషన్‌పై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.






