ఉగాండాది మరో కథ
అమెరికా, కెనడా తరహాలోనే ఉగాండా జట్టు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ బరిలోకి దిగుతోంది. మెగాటోర్నీలో ఆడుతున్న మిగిలిన 17 జట్లు ఎప్పుడో ఒక్కసారైనా ప్రపంచకప్ ఆడగా.. ఉగాండాకు ఇదే మొదటిది. మురికి కూపాల్లాంటి పట్టణాలతో.. కనీస పారిశుధ్య వసతులు లేని నగరాల నుంచి వచ్చిన ఆటగాళ్లు.. విశ్వ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. భారత్, పాకిస్థాన్ వంటి క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశాల్లో అవకాశాలు దక్కని అత్యధిక మంది ప్లేయర్లు.. క్రికెట్‌లో బలహీనంగా ఉన్న దేశాలకు వలసవెళ్లి అక్కడ అవకాశాలు అందిపుచ్చుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో భాగంగానే పలువురు భారత, పాకిస్థాన్ ప్లేయర్లు ఉగాండా జట్టు తరఫున ఈసారి వరల్డ్‌కప్ ఆడేందుకు రెడీ అయ్యారు. ఇందులో దినేశ్ నకారానీ ఒకడు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన దినేశ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మెరుగైన చాన్స్‌ల కోసం ఉగాండా వెళ్లి.. ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడు. ముంబైలో జన్మించిన అల్పేశ్ రామ్‌జానీ, రోనక్ పటేల్, పాకిస్థాన్‌లని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన బిలాల్ హసన్, రియాజత్ అలీ షా కూడా ఇదే కోవలోకి వస్తారు.






