10-12-2025 12:49:28 AM
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో..
తీరు మారిన పంచాయితీ ఎన్నికల ప్రచారం
ఎవరినీ కాదనలేక సందిగ్ధంలో ఓటర్లు
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి గ్రామంలో అభ్యర్థులు తమ తమ విధానాలు, అభివృద్ధి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందుకు స్మార్ట్ ఫోన్ ప్రత్యేక వేదికగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది.
సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా అభ్యర్థులు తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. వీడియో, ఆడియో సందేశాలు, చిన్న ప్రమోషనల్ క్లిప్లు, లైవ్ ఇంటరాక్షన్లు, అభిప్రాయ సేకరణ వంటి ప్రోగ్రామ్ల స్టేటస్ లు హల్చల్ సృష్టిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా అదే స్టేటస్ లను ఫోటోలను కూడా స్టేటస్లుగా పెట్టుకోవాలంటూ అభ్యర్థులు ఓటర్లను ఒత్తిడి తెస్తున్నారు.
దీంతో ప్రచారంలో ఉన్న అభ్యర్థులు ఎవరినీ కాదనలేక ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకరి ఫోటోలు స్టేటస్ గా పెట్టుకుంటే మరొకరికి ఇబ్బందిగా మారడంతో కొత్త తలనొప్పి వచ్చి పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు స్వేచ్ఛ స్వతంత్రం భారత రాజ్యాంగం కల్పించింది.
ఎన్నికల ప్రక్రియలో అధికారులు పోలింగ్ కేంద్రంలో తెరచాటున ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. కానీ అభ్యర్థుల స్టేటస్లు ఓటర్లు కూడా పెట్టుకోవడంతో ఓటు నమోదు బహిర్గతం కావడంతో ఇతర అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందని అభిప్రాయ పడుతున్నారు. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయతీ తెచ్చి పెడుతోందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తీరు మారిన పంచాయతీ ఎన్నికల ప్రచారం.
గ్రామపంచాయతీ ఎన్నికలంటేనే ఓ సం దడి వాతావరణం. అక్క, చెల్ల, అన్న, తమ్మి, పెదనాన్న, చిన్నాన్న అంటూ వరుసలు కలుపుకొని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రేమ ఆప్యాయతతో ఓటును అభ్యర్థించే వారు. కరపత్రాలు, బ్యానర్లు, ప్లకార్డులు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ద్వారా బరిలో నిలిచిన అభ్యర్థి ఫోటో గుర్తులను ప్రచారం చేస్తూ అభివృద్ధి అంశాలను కరపత్రాల ద్వారా ప్రజలకు అందించేవారు.
కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరగడంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు వాట్సాప్ గ్రూపు లు స్టేటస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి వేదికల ద్వారా తమ గుర్తులను ప్రచారం చేస్తున్నారు. మహిళా సంఘాలు కుల సంఘాలు గ్రామసంఘాలు వంటి వాట్సాప్ గ్రూప్ లలో ప్రచారం హోరెత్తిస్తూ పంచాయతీ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతోంది.
కొంతమంది అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలు పాడించి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతోపాటు మరో అడుగు ముందుకేస్తూ అన్న నా ఫోటో స్టేటస్ పెట్టే.. అంటూ ఓటర్లను ఒత్తిడి చేయడంతో ఎటు తేల్చుకోలేక ఓటర్లు తల్లడిల్లుతున్నారు. డబ్బు పంపిణీ కూడా గూగుల్ పే ఫోన్ పే వంటి డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. మరి కొంతమంది అభ్యర్థులు తమ పార్టీ నేతలు కార్యకర్తల చేత గ్రూపుల్లో ఇతరులను కించపరిచేలా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ప్రచారం సాగించ డంతో పోలీసులకు కూడా కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.