10-12-2025 12:49:15 AM
అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.71 వేల కోట్ల రుణ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’కు సేకరించే ఆర్థిక వనరులను ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నుంచి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9న కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు.
అయితే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా అన్ని ప్రభుత్వాలకూ ఒకే కొలమానాన్ని వర్తింపజే స్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం నిర్దేశించిన ఆర్థిక పరిమితులకు లోబడే రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ సేకరణకు అనుమతిస్తుందని చెప్పారు. దాన్ని అనుసరించే ఈ ఏడాది రూ.71 వేల కోట్లకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతకుమించి రుణ పరిమితిలో మినహాయింపునిచ్చే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.