శిథిల భవనాలు కూల్చి వేతకు చర్యలు
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కుభీర్ మండలంలోని అంతర్ని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. కూల్చివేతకు అనుమతులు తీసుకున్నప్పటికీ, ఇటీవలి వర్షాల కారణంగా ఆలస్యమైందని వెల్లడించారు.
ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పాఠశాలల శిథిల భవనాల కూల్చివేతకు రోడ్లు, భవనాల శాఖ నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు తీసుకొని తక్షణమే కూల్చివేత ప్రక్రియ చేపట్టనున్నామని తెలిపారు. విద్యార్థులు భద్రతాయుత వాతావరణంలో చదివేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.






