ఆరోగ్యకరమైన మొయినాబాద్ దిశగా అడుగులు
ఘనంగా ‘హ్యాపీ సండే’ యోగ, ధ్యాన కార్యక్రమం
మొయినాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొయినాబాద్ను ఆరోగ్యకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆదివారం హిమాయత్నగర్ గురుకుల పాఠశాలలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, కమిషనర్ జాకీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగ, ధ్యానం చేశారు. 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో యోగ, ధ్యానం విశిష్టతలపై అవగాహన కల్పించారు.
నిత్యం ప్రజాసేవలో ఒత్తిడికి గురయ్యే మున్సిపల్ యంత్రాంగం మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం ఒకచోట చేరి యోగాసనాలు వేయడం విశేషం.ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో కొంతసమయాన్ని యోగ, ధ్యానానికి కేటాయించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్ సూచించారు. ఆరోగ్యకరమైన మొయినాబాద్ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ మరియు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






