పిట్టకథలు ఆపి.. పథకాలు అమలు చేయండి
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి):కాంగ్రెస్ ప్రభుత్వం పిట్టకథలు చెప్పడం మానేసి, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మిషాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని విమర్శించారు.
ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం అమల్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భరోసాను లాక్కునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు.ముఖ్యమంత్రి, మంత్రులపై ఉన్న అవినీతి కేసుల్లో వాదనలు వినిపించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ న్యాయవాదులను నియమించుకునే ప్రభుత్వం.. పేదింటి ఆడబిడ్డల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మిషాదీ ముబారక్ పథకాన్ని కాపాడేందుకు కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కల్యాణలక్ష్మిషాదీ ముబారక్ పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






