calender_icon.png 28 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కుంభకోణాలను.. అడ్డుకోండి!

28-01-2026 01:40:25 AM

సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

  1. పారదర్శకతకు పాతరేసి ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ 
  2. ఫుట్‌బాల్ పేరిట రూ. 10కోట్ల నిధుల దుర్వినియోగం
  3. హరీశ్‌రావు ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్‌లో వణుకు
  4. స్కాం బట్టబయలయ్యే సరికి పాలకుల గుండెళ్లో రైళ్లు
  5. డైవర్ట్ చేయడానికే ఒకరి తర్వాత ఒకరి సిట్ విచారణ 
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సీఎం అంటే.. కోల్ మాఫియా

సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు.. సీఎం అంటే కోల్ మాఫియాకు నాయకుడిగా ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు, ముఖ్యం గా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి దాపురించింది. ఆధారాలతో సహా కుంభకోణాన్ని బట్టబయలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ని మళ్లించడానికి, విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని సిట్ పిలుస్తున్న పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మేం లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విష యంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి.

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) :  సింగరేణి కుంభకోణాల అంశంలో జోక్యం చేసుకోవాలని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.  సీబీఐకి ఇస్తారా? సిట్టింగ్ జడ్జికి ఇస్తారా?.. ఎవరితోనైనా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. కానీ, ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్‌లో కుంభకోణం, ఇటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణాలను అడ్డుకోవాలని గవర్నర్‌కు విన్నవించినట్టు వివరించారు. 

రాష్ర్టంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంపై మంగళవా రం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల బృందం కలిసి మెమోరాండం అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గు గని టెండర్లే కాదు... అన్ని టెండర్లను పారదర్శకత ఉండాలన్నారు. నైనీలో కూడా గతంలో 2021లో, 2022లో రెండు సార్లు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచామని, కానీ ఆ రోజు ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన లేదని గుర్తుచేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో అవసరం లేనిది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమైందని ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లలో సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, కానీ తెలంగాణలోని సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్లు అని, ఇది సోలార్ స్కాం కాదా అని నిలదీశారు.

ఎక్స్‌ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్‌కు 30 శాతం అదనంగా రేటు పెంచారని, డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో, వాళ్లపై యాక్షన్ తీసుకున్నాకరే తప్ప, కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెన్కక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని, కాంట్రాక్టర్లను బెదిరించి,  ఒక రింగు చేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును వివరించినట్టు తెలిపారు.

సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కోల్ మాఫియా!

సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదని, సీఎం అంటే కోల్ మాఫియాకు నాయకుడిగా ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు, ము ఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి దాపురించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశం పెట్టి, ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుం చి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని తెలిపారు.

మీడియా కూడా మాకు సహకరించి సింగరేణి కుంభకోణాన్ని పూర్తిస్థాయి లో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండె ల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశా రు. ఆధారాలతో సహా కుంభకోణాన్ని బట్టబయలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని సిట్ పిలుస్తున్న పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు.

ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభు త్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావ డం లేదని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని సూచించారు. స్పందించాల్సిన సీఎం ఏమో అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నారని, లేదా విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలతో, సింగరేణి సంస్థతో సీఎం ఫుట్ బాల్ ఆడటంలో భాగంగా రూ. 10 కోట్ల నిధులు దుర్వినియోగం చేసి ఆ సంస్థకి తీర ని అన్యాయం చేశారని విమర్శించారు.  

ఎక్కడా లేనిది ఇక్కడెందుకు అంటే సమాధానం లేదు..

పారదర్శకతను పాతరేసి టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ నిబంధన ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం రాలేదన్నారు. నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే, ఆ రోజున బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని, ఆనాడు అన్ని టెండర్లను కూడా ట్రాన్స్‌ఫరెంట్‌గా పిలిచామని గుర్తు చేశారు.

అందుకే ఆరోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చాయని, ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బు ఆదా చేస్తూ ఆరోజు జరిగిన మాట వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు. టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానం ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చేయడానికి? అని నిలదీశారు. నిబంధన తీసుకొచ్చినప్పటి నుంచి  తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు, ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు?, మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి?, ఎన్ని లేఖలు వచ్చాయి?, ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది? అని ప్రశ్నించారు.

దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానమే లేదన్నారు. కొంతమందికే సెలెక్టివ్‌గా ఎందుకు ఇచ్చారు?, మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలనే ఎందుకు మీరు ఎన్నుకుంటున్నారు?, మిగతా వాళ్లని ఎందుకు పక్కన పెడుతున్నారు? అని నిలదీశారు. ఈ విషయంలో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం బావమరిది అవునా కాదా అని అడిగితే ఇంతవరకు సమాధానం రాదు, స్పష్టత రాదన్నారు.