28-01-2026 01:36:43 AM
మోగిన నగారా
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు
నేటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని 116 మున్సిపా లిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నగరా మోగింది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే 12తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు.
మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటన్నీ పూర్తయినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.
మొత్తం ఓటర్లు 52.43 లక్షలు
నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ఈ నెల 30 వరకు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, ఫిబ్రవరి 11న పోలింగ్, 13న లెక్కింపు తర్వాత 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. రీపోలింగ్ ఉంటే ఫిబ్రవరి 12న నిర్వ హించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ , కార్పొరే షన్ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు, ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. 2,996 వార్డులకు గాను 8,203 పోలింగ్ స్టేషన్లు, 16,03 పోలింగ్ బాక్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. బ్యాలెట్ బాక్సుల కోసం 137 స్ట్రాంగ్ రూమ్స్, ఓట్ల లెక్కింపునకు 136 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 742 జోనల్ ఆఫీసర్స్, 1,379 మంది ఆర్వోలు, 1,547 ఏఆర్వోలు, 9,560 మంది పోలింగ్ అధికారులు, 31,428 మంది ఓపీఎస్‌లు విధులు నిర్వహించనున్నారని ఎస్‌ఈసీ రాణికుముదిని తెలిపారు.
రూ. 50వేల నగదు వరకే అనుమతి : మహేష్‌భగవత్
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్‌భగవత్ తెలిపారు. ఎవరైనా డబ్బులు తీసుకెళ్లేందుకు రూ.50వేల వరకే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలని, వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుందన్నారు, ఎన్నికల నిర్వహణలో భాగంగా 22 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మేడారం వెళ్లే భక్తులకు చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. 1,926 సెన్సిటివ్, 1300 అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. కమ్యునల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్‌లు ఉన్నాయన్నారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్
* జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
* జనవరి 31న నామినేషన్ల పరిశీలన
* ఫిబ్రవరి 3వరకు నామినేషన్ల ఉప సంహరణ గడువు
* ఫిబ్రవరి 11న పోలింగ్
* ఫిబ్రవరి 12న ఎక్కడైనా రీపోలింగ్ (ఉంటేనే)
aఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
aఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్..
కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు