calender_icon.png 28 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహస్యమేమీలేదు!

28-01-2026 01:43:51 AM

  1. మంత్రుల భేటీపై విషప్రచారం తగదు 
  2. లోక్ భవన్ నుంచి ఒకే కారులో బహిరంగంగానే వెళ్లాం.. 
  3. మా భేటీలో ప్రధాన చర్చ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపైనే..

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టీకరణ

* రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పనిగట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రుల భేటీకి లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు. 

 మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్యంలో బాధ్యతా యుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ ‘రహస్య భేటీ’ అంటూ విష ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హితవుపలికారు. మంత్రుల భేటీపై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పనిగట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులుగా మేం చర్చించు కుంటే అందులో తప్పేముంది? అది ప్రభుత్వ సమష్టి బాధ్యత. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మేం భేటీ అయ్యి పాలనాపరమైన అంశాలను చర్చించాం’ అని స్పష్టం చేశారు. ఇందు లో రహస్యమేమీలేదని మంత్రి స్పష్టం చేశారు. ‘లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే మేమంతా ఒకే కారులో వెళ్లాం.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత. దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిర్మాణాత్మకమైన విమర్శలను మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మా ప్రభుత్వంపై అసత్య ప్రచా రం చేయడం ఇకనైనా మానుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని కోరారు. సోమవారం రాత్రి డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో, ఆయనతో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ రహస్యంగా సమావేశమయ్యారంటూ మీడియా కథనాలు వచ్చాయి.

తప్పేంటి?: డిప్యూటీ సీఎం భట్టి

‘ముఖ్యమంత్రి లేకుండా డిప్యూటీ సీఎంతో మంత్రులు మాట్లాడరా? నాతో జిల్లాల మంత్రులు, నేతలు మాట్లాడటం సాధారణమే. మాజీమంత్రి జీవన్‌రెడ్డి సమస్యపై కరీంనగర్ జిల్లా నేతలతో  కూడా మాట్లాడా. వీటితోపాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై మంత్రులతో చర్చించా. ఇందులో తప్పేముంది’. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మధిరలో మీడియాతో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.