28 July, 2026 | 12:06 AM

రైల్ రోకో కేసు విచారణ ఆపండి

26-06-2024 12:05 AM

కేసీఆర్ పిటిషన్‌పై కింది కోర్టుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011లో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించా రంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కింది కోర్టులోని కేసు విచారణను నిలిపివేస్తూ హైకోరుట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం స్టే ఆదేశాలను వెలువరి ంచారు. రైల్ రోకోలో కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనలేదన్న ఆయన తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొన్నది.

ప్రతివాదులైన రైల్వే పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రైల్ రోకో నిర్వహించాలని నాటి టీఆర్‌ఎస్ అథినేత కేసీఆర్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడుగా కోదండరాం పిలుపు ఇచ్చారని చెప్పి పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. కొందరి మౌఖిక వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టడం అన్యాయమని అన్నారు.

పిటిషనర్ ఎలాంటి రైల్ రోకోలో పాల్గొనలేదని తెలిపారు. అప్పుడు రైల్ రోకోలో పాల్గొన్న దాదాపు 40 మందిలో కే కవిత తదితరులపై కేసు పెట్టారని, ఆ కేసులో వారందరికీ బెయిల్ కూడా వచ్చిందని గుర్తుచేశారు. రైలురోకోకు ఏమాత్రం సంబంధం లేకపోయినా పిటిషనర్ పాత్ర ఉందంటూ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేశారని, దీనికి ఆ కోర్టు నంబర్ కూడా కేటాయించిందని వివరించారు. ఈ వాదనల తర్వాత కేసీఆర్ ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఆదేశాలను వెలువరించారు.