క్షుద్బాధలోనూ పుణ్యకార్యం
లోకంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులను ఎవరూ విడిచిపెట్టరు. కన్నవారు దివంగతులైన తర్వాత ఆస్తుల్ని పంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లలు వున్నారు. మేం మా తల్లిదండ్రులకు ముగ్గురం మగపిల్లలం. మాకు ఆస్తులు పంచుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. నిజానికి ఒక ఇల్లు తప్ప మాకున్న ఆస్తి పెద్దగా ఏమీ లేదు. నాన్న తర్వాత అమ్మ స్వర్గస్థురాలైంది. ఆస్తుల విషయంలో లేని పొరపొ చ్చాలు అమ్మ కాలం చేసే కాలానికి ఎక్కువయ్యాయి. మా పెద్దన్న ఒకవైపు, చిన్న న్న నేను ఇంకొక వైపు నిలబడ్డాం, వేరే కారణాలవల్ల. దురదృష్టవశాత్తు అమ్మ అస్థుల్ని రెండు భాగాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మా వూరికి సమీపంలో నాగార్జునసాగర్ వుంది. అస్థుల్ని కృష్ణలో కలపడానికి చిన్నన్న నేనూ బయల్దేరాం. కృష్ణలో అస్థుల్ని నిమజ్జనం చేసి, స్నానసంధ్యలు ముగించుకొని ఆకలేయడం వల్ల ఒక హోటల్లోకి ప్రవేశించాం. ఆకలితో ఉండడం వల్ల మా అన్న హోటల్లోకి ప్రవేశించగానే టిఫిన్ తెమ్మని బేరర్‌కు ఆర్డరిచ్చాడు.
“అన్నయ్యా! ఆకలి బాగా వేస్తున్నది. భోజనం చేద్దాం. మీల్స్‌కు ఆర్డర్ ఇద్దాం” అన్నాను. వెంటనే మా అన్నయ్య “రెండు మీల్స్” అని ఆర్డరిచ్చాడు. అంతటితో ఊరుకోక “నాకు కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుందిరా” అన్నాడు. “నీ ఇష్టం అన్నయ్యా” అన్నాను. ఆలస్యం చేయకుండా మా అన్నయ్య వెంటనే “రెండు మాజాలివ్వండి” అని మరో ఆర్డర్ ఇచ్చా డు. ఆయన ఉద్దేశం ప్రకారం టిఫిన్‌కు బదులుగా మీల్స్ వస్తుందని నేను కూడా అనుకున్నాను. అట్లే, మీల్స్‌కంటే ముందు కూల్‌డ్రింక్స్ వస్తాయనీ అనుకున్నాను. కానీ, అంతా అనుకున్నట్లు జరగలేదు. టిఫిన్ తెచ్చేవాడు టిఫిన్ తెచ్చాడు, మీల్స్ తెచ్చేవాడు మీల్స్ తెచ్చాడు, కూల్‌డ్రింక్స్ తెచ్చేవాడు కూల్‌డ్రింక్స్ తెచ్చాడు. టేబిల్ ముందు కూర్చున్న మాకు వాటన్నింటినీ స్వీకరించక ముందే ఆకలి తీరినట్లుంది. కొత్తగా హోటల్‌లోకి వచ్చినట్లుంది. లేకపోతే ఆర్డరిచ్చినప్పుడు ఏది మొదట తేవాలో, ఏది తర్వాత తేవాలో హోటల్ వాళ్లు తెలుసుకొని ప్రవర్తించాలి. కాని, మేం ఆర్డర్ ఇచ్చిందే తడవుగా అన్నీ తెచ్చి టేబుల్‌మీద పెట్టించాడు.
తినడానికి తికమక
పూర్వం శ్రీశ్రీ మహాకవి హోటల్‌కు వెళ్లినప్పుడు ఏం తినాలో తెలియక తికమక పడ్డాడట! మా పరిస్థితీ అలాగే ఉంది. టిఫి న్ చేసి, కూల్‌డ్రింక్స్ తాగాలా లేక భోజనం చేసి కూల్‌డ్రింక్స్ తాగాలా? ఒకవేళ టిఫిన్ చేసి, ఆ తర్వాత మీల్స్ చేయగలమా? మొదటనే కూల్‌డ్రింక్స్ తాగితే టిఫిన్‌గాని, భోజనం గాని చేసే అవకాశం ఉంటుం దా? ఎంత తికమక పడ్డామో చెప్పలేను. ఊరినుంచి రావడం, కృష్ణ లో పని ముగించుకోవడం, ఆదరాబాదరాగా హోటల్‌కు రావడం, ఆకలి వేయడం చకచకా జరిగా యి. ఆకలికి మా అన్నగారు తట్టుకోలేకపోయారు. ఊళ్లో వేళకు భోంచేయడం ఆయ నకు అలవాటు. కాని, ఆలోచించకుండా హోటల్ వాడికి ఆర్డర్ ఇవ్వడం ఏమిటి? వాడవన్నీ తెచ్చిపెట్టడం ఏమిటి? నాకిలాంటి ఆలోచనలు కలిగాయిగాని మా అన్నగారు ఏమీ ఆలోచించకుండా “బాబూ! టిఫిన్ వాపస్. భోజనం ఉంచు. ఈ కూల్ డ్రింక్స్ తర్వాత తీసుకురా” అని బేరర్‌ను ఆజ్ఙాపించాడు. కాని, వాడు సామాన్యుడు కాడు. “సార్! మీరు ఆర్డర్ చేసినవే తెచ్చాం. మళ్లీ తీసుకుపోయే క్వశ్చనే లేదు. మీరు తీసుకున్నా తీసుకోక పోయినా బిల్లు చెల్లించవలసిందే” అన్నా డు. మా అన్నయ్యకు అసహ్యం వేసింది. వాడి మాటలతో ఆకలి కాస్త మందగించినట్లుంది. “తమ్ముడూ, నాకీ హోటల్ నచ్చ లేదు. నేను ఇవేవీ ముట్టను” అన్నాడు.
అమ్మపేరు మీద అన్నదానం
నాకు ఏం చేయాలో తోచలేదు. మా అన్న ఉన్నట్లుండి హోటల్ బయటి ద్వారం వైపు చూశాడు. అక్కడొక బిచ్చగాడున్నాడు. వెంటనే లేచి అతణ్ణి మేమున్న టేబిల్ దగ్గరకు తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. “బాబూ! ఇది టిఫిన్, ఇది భోజనం. నీకేది ఇష్టమైతే దాన్ని తిను” అన్నాడు. యాచకుని ముఖంలో సంతో షం చూసిన నేను, “ఔను బాబు! మా అమ్మగారి పేరుమీద నీకు భోజనం. బిల్లు మేమే చెల్లిస్తాం” అన్నాను. యాచకుడు భోజనం చేయడం మొదలుపెట్టాడు. మేం చెరొక బాటిల్ చొప్పున కూల్‌డ్రింక్స్ చేతిలో పట్టుకొని, క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చి అన్నింటికీ బిల్లు చెల్లించాం. నేను కూల్ డ్రింక్ తాగుదామని నోటి దగ్గర పెట్టుకున్నాను. కాని, మా అన్నగారు, “వద్దు తమ్ముడూ! మనకీ రోజు ఏదీ ప్రాప్తి లేదు.బయటికి వెళ్లి ఏమైనా పళ్లు తిందాం. లేదా ఉపవాసం వుందాం.ఒకరోజు అమ్మ పేరుమీద ఉపవాసం ఉండలేమా?” అన్నాడు. నేను కూడా చేసేదేమీ లేక తాగుతున్న బాటిల్ టేబిల్‌మీద పెట్టాను.
దేనికైనా అదృష్టం వుండాలి. అమ్మ బతికి వున్నన్ని రోజులు మాకు ఆకలి తెలియలేదు. కాని, ఈ రోజు నిజంగా ఆకలం టే ఏమిటో తెలుసుకున్నాం. హోటల్లో జరిగిన సంఘటనను పదేపదే స్మరణకు తెచ్చుకొని నవ్వుకున్నాం. మా అన్నయ్యకు చివరికి జ్ఞానోదయం అయినట్లు ఒకమాట సెలవిచ్చాడు. “ఒరేయ్ తమ్ముడూ! మనం ఎక్కడికైనా వెళ్లి ఏదైనా కొనాలనుకున్నప్పుడుగాని, ఏదైనా తినాలని అనుకు న్నప్పుడు గాని మొదలే నిశ్చయించుకొని దాన్ని మాత్రమే ఆర్డర్ ఇవ్వాలి. కాని, అన్నీ ఒక్కసారే ఇస్తే ప్రమాదమే”. ఐతే, సాగర్ లో ఒక హోటల్‌లో జరిగినట్లే అన్ని హోటళ్లలో జరగాలని లేదు. హోటల్ వాళ్లు తెలి విగల వాళ్లు. తమ హోటల్‌కు వచ్చేవాళ్ల వాలకం కనిపెట్టి వాళ్లను ఇబ్బంది పెడతా రు. జీవితంలో ఇప్పటికీ మా అన్నదమ్ములిద్దరికీ ఇది మరపురాని సంఘటన. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మేం ఇద్దరం కలిసి నవ్వుకోకుండా ఉండలేకపోతాం.
వ్యాసకర్త : ఆచార్య మసన చెన్నప్ప,
సెల్: 9885654381
పూర్వం శ్రీశ్రీ మహాకవి హోటల్‌కు వెళ్లినప్పుడు ఏం తినాలో తెలియక తికమక పడ్డాడట! మా పరిస్థితీ అలాగే ఉంది. ఎంత తికమక పడ్డామో చెప్పలేను.






