2 July, 2026 | 4:26 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

అమెరికాలో మిస్సింగ్

11-05-2024 12:05 AM

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి గల్లంతయ్యాడన్న వార్త ఉభ య తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురి చేస్తోంది. విస్కాన్సిన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న హనుమకొండకు చెందిన రూపేశ్ చంద్ర ఈ నెల 2న చికాగో వెళ్లాడు. అప్పటినుంచి అతను కనిపించడం లేదు. అదే రోజు మధ్యాహ్నం రూపేశ్‌తో  వాట్సాప్ కాల్ మాట్లాడామని, ఆ తర్వాతినుంచి అతని ఫోన్ స్విచాఫ్ వస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. రూపేశ్ స్నేహితుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నా ఇప్పటివరకు జాడ తెలియరాలేదు. ఈ ఏడాది ప్రారం భం నుంచి ఇప్పటిదాకా భారతీయ సంతతికి చెందిన పదిమంది  విద్యార్థులు  కనిపించకుండా పోవడం లేదా ప్రమాదాల్లో చనిపోవడం జరి గింది. మిస్సింగ్ అయిన వారిలో కొందరు  హత్యకు గురయ్యారు కూడా. ఈ ఘటనలన్నిటికీ ఒక దానితో మరో దానికి సంబంధం కానీ, పోలిక కానీ లేనప్పటికీ తరచూ విద్యార్థులు గల్లంతవుతూ ఉండడం  స్వదేశంలో ఉన్న కుటుంబసభ్యులకు గుండెకోతను మిగులుస్తోంది. ఈ నెల 5న తెలంగాణకే చెందిన ఉమా సత్యసాయి గద్దె ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌ల్యాం డ్‌లో మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ తెలియజేసింది. ఈ ఘటనకు కొద్ది రోజులు ముందు ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన ఆచంట రేవంత్ అనే 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

డకోటా యూనివర్సిటీలో ఎంఎస్ చదవడం కోసం రేవంత్ గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. జనవరిలో వనపర్తిజిల్లాకు చెందిన గట్టు దినేశ్‌తోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో తమ గదిలో విగత జీవులై కనిపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి 17 రోజు ల క్రితమే అమెరికా వెళ్లిన దినేశ్ విష వాయువు పీల్చడం వల్ల చనిపోయినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే పైచదువుల కోసం అమెరికా వెళ్లి అర్ధాంతరంగా కనిపించకుండా పోవడం,  ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య చాలానే ఉంటున్నది.  వీరిలో కొంతమంది అనుకోని దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే మరికొందరు దారుణ హత్యలకు గురవుతు న్నారు. రాత్రిపూట ఒంటరిగా తిరిగే ఇలాంటి వారిపై దుండగులు దాడి చేసి డబ్బులు, ఇతర విలువైన వస్తువులు దోచుకునే క్రమంలో ప్రాణాలు తీస్తున్నట్లు సమాచారం. వరస ఘటనలతో భారతీయ విద్యార్థులు ఒంటరిగా ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు.చుట్టూ పదిమంది ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనతో బైటికి వెళ్లాలంటేనే భయమేస్తోందని చాలామంది భారతీయ విద్యార్థులు చెప్పడం గమనార్హం. ప్రతినెలా రెండు మూడు ఘటనలు జరుగుతుండడంతో చదువులు కొనసాగించలేక, తిరిగి రాలేక ఆందోళన చెందుతున్నారు.  


అమెరికాలో పై చదువులు చదవాలన్నది చాలామంది విద్యార్థుల కల. అష్టకష్టాలు పడి అక్కడి వర్సిటీల్లో సీటు సంపాదించి వీసా పొంది అమెరికాలో అడుగు పెడుతున్న వారు ఏటా ఎన్నో వేలమంది ఉంటున్నారు. ప్రస్తుతం దాదాపు 30 వేల మంది అమెరికాలోని వివిధ వర్సిటీల్లో పై చదువులు చదువుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న వారంతా పాతికేళ్లలోపు వారే. అమెరికాలో పైచదువులు చదివితే మంచి ఉద్యోగాలు వస్తా యన్న ఆశతో చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడ చదవడం ఆర్థికంగా భారమైనా తల్లిదండ్రులు కూడా ఆస్తులు అమ్మో, అప్పులు చేసో పిల్లలను పంపిస్తున్నారు. అయితే, అక్కడ ఏ కారణంగానైనా సరే దారుణంగా ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిలి స్త్తోంది. అమెరికాలో శాంతిభద్రతల వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉన్నప్పటికీ అక్కడి సంఘ విద్రోహ శక్తులు కిడ్నాప్‌లు, హత్యలు లాంటి  దారుణాలకు యదేచ్ఛగా పాల్పడుతున్నారు. భారత ప్రభుత్వం అమెరికా అధికారులను సంప్రదించి మిస్సింగ్ అయినవారి జాడను త్వరగా కనిపెట్టాలి. వర్సిటీల్లో మరింత భద్రతకు చర్యలు చేపట్టాలి.