మోహన్ రుషి జీరో డిగ్రీ
కవిత్వం అంటే ఏదో పదాల కూర్పు కాదు. వాక్యాలను కట్ చేస్తూ ఒక్కో పదాన్ని నిచ్చెన మెట్లవలె పేరిస్తే అది కవిత్వమై పోతుందంటే పొరపాటు. కవిత్వం పేరుతో వచనం రాసే కవులు అనేకమంది వున్న ఈ కాలం లో నిజమైన, నిఖార్సయిన, నిబద్ధత తో కూడిన, ఇంకా మామూలుగా గుండెను తాకడమేకాదు, ఏకంగా ఒక్కోసారి హృదయాన్ని పిండేసే భావాలు రంగరించి అద్భుత కవితా పంక్తుల్ని సృష్టించే కవులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరే మోహన్ రుషి.
‘జీరో డిగ్రీ’ పేరున ద్వితీయ ముద్రణతో వెలువడిన ఆయన కవితా సంకలనం సాహిత్యప్రియులకు ఒక పాఠ్య పుస్తకం వంటిదే. మోహన్ రుషి కవిత్వంలో అంతర్ముఖుడైన కవి హృదయం సామాజిక చిత్రంగా ఆవిష్కృతమవుతుంది. తెలంగాణ ఆత్మే స్వయంగా తన వేదనను, రోదనను మనతో పంచుకుంటున్నట్టే వుంటుంది. ‘తోముతున్న అంట్లలో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూడట మే తప్ప ప్రపంచంలో జరుగుతున్నదేమిటో తెలియదు’ అంటూ అమ్మత నాన్ని ‘పాత యంత్రం’ (పే: 01) పేరుతో ఆవిష్కరించిన తొలి కవితతోనే కవి రుషి అక్షర తపస్సు మన కు బోధపడుతుంది. మొత్తం తొంభై ఆరు కవితలలో ఆఖరు కవిత కూడా అమ్మపైనే.
‘అమ్మలంతా ఒకవైపు!’ (పే: 110) శీర్షికన ‘షుగరు కూడా వుంది కదా నాయనా, అందుకే ఇట్ల, వేళ్ల చివర్లన్ని ఇట్ల..’ అంటూ ఆమె దుఃఖాన్ని, తన నిస్సహాయత తనాన్ని అక్షరాల్లో నింపి పాఠకులకు అందించారు. ‘కృష్ణశాస్త్రిలాగే విషాదంలో దాక్కు న్న కవి మోహన్ రుషి’ అంటారు ప్రసి ద్ధ కవి, సాహిత్యవేత్త అంబటి సురేంద్రరాజు ‘ముందుమాట’లో. ఇంతేకాదు, తెలంగాణ ‘దుఃఖాన్ని తెలంగాణ నుడికారంలో అత్యంత ప్రతిభావంతంగా రూపుగట్టిన ఖ్యాతికూడా ఈ కవికి దక్కుతుంది’ అని ఆయనన్నారు. ఈ మాటలు అక్షర సత్యాలు. ప్రతీ కవిత్వంలో ఒక ఆర్ద్రత తగుల్తుంది.
జీరో డిగ్రీ, కవితా సంకలనం మోహన్ రుషి, పేజీలు: 116,
ప్రచురణ: కంపోజ్ ఇంప్రెషన్స్, మాసాబ్‌ట్యాంక్,
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, పాలపిట్ల, దిశ, బ్రహ్మం భవన గ్రాఫిక్స్, కొత్తపేట,
హైదరాబాద్. సెల్: 98482 54745
Ebook: www.kinige.com






