చీకట్లో శంషాబాద్?
- మహిళల భద్రత గాల్లో దీపమేనా?
- రైల్వే కమాన్ నుంచి బస్స్టాండ్ వరకు వెలగని వీధిలైట్లు
- ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్‌కు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
- జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత పట్టించుకునే వారే లేరని స్థానికుల ఆగ్రహం
శంషాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన శంషాబాద్లో రాత్రి వేళల్లో అడుగుపెట్టాలంటేనే మహిళలు, ప్రయాణికులు వణికిపోతున్నారు. నగరాభివృద్ధిలో భాగమంటూ జీహెచ్‌ఎంసీలో విలీనం చేసినప్పటికీ, ఇక్కడి కనీస సౌకర్యాలు మాత్రంఅంధకారంలోనే మగ్గుతు న్నాయి. శంషాబాద్ రైల్వే కమాన్ నుంచి బస్స్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై వీధిలైట్లు వెలగకపోవడంతో ఈ మార్గం పూర్తిగా చీకటిమయంగా మారింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ రోడ్డులో కనీస వెలుతురు లేకపోవడం అధికారుల ఘోర నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
భయాందోళనల్లో మహిళా ఉద్యోగులు, ప్రయాణికులు..
ఈ మార్గం గుండానే శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు విధులకు వెళ్లే వందలాది మంది ఉద్యోగులు, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఘోరమైన చీకటి కారణంగా ఈ ప్రాంతంలో అసాంఘి క కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, మహిళల భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటిచూపు ఆనని చీకటి వల్ల వాహనదారులు రోడ్డుపై ఉన్న గోతులను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.
గతంలో ఈ చీకటి కారణంగా కొన్ని చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగాయని వాహనదారులు గుర్తు చేస్తున్నారు. ఈ సమస్యపై శంషాబాద్కు చెందిన సామాజిక నాయకులు తోకల శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో శంషాబాద్ గ్రామ పంచాయతీగా, ఆ తర్వాత మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించేవారని ఆయన గుర్తు చేశారు. (జీహెచ్‌ఎంసీ)లో శంషాబాద్‌ను కలిపిన తర్వాత స్థానిక సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పట్టణ ప్రజలు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
పట్టణంలో అధికారులు ప్రజా అవసరాలను గాలికొదిలేశారు. వీధిలైట్ల లాంటి ప్రాథమిక అవసరాన్ని కూడా తీర్చలేకపోవడం దారు ణం. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైల్వే కమాన్ నుంచి బస్స్టాండ్ వరకు కొత్త విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నిఘా నేత్రాలున్నా.. వెలుతురు లేకపోతే లాభమేంటి?
ప్రభుత్వం మహిళల భద్రత కోసం వేల సంఖ్యలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతోంది. కానీ, కనీసం వీధిలైట్లు లేకపోతే రాత్రి వేళల్లో ఆ కెమెరాల్లో ఎలాంటి విజువల్స్ రికార్డ్ కావు. ఇది అసాంఘిక శక్తులకు, దొంగలకు వరం గా మారుతుందని క్రైమ్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. పన్నులపై ఉన్న శ్రద్ధ.. సౌకర్యా లపై లేదా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చాక పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ, కనీస సౌకర్యాల కల్పనపై అధికారులు చూపడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని యుద్ధప్రాతిపదికన ఈ చీకట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యపై జిహెచ్‌ఎంసీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడక తప్పదు మరి.
సమస్యలు పట్టించుకోవడం లేదు..
శంషాబాద్ గ్రామ పంచాయతీగా, మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై అధికారులు స్పందించేవారు. జీహెచ్‌ఎంసీలో కలిసిన తర్వాత కనీస సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. రైల్వే కమాన్ నుంచి బస్స్టాండ్ వరకు వెంటనే కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేయాలి.
తోకల శంకర్, సామాజిక నాయకుడు
రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నాం..
ఎయిర్పోర్ట్‌కు వెళ్లే ఉద్యోగులు, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు నిత్యం ఈ మార్గం గుండా ప్రయాణిస్తారు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
రాహుల్ అప్ప, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు
వీధి లైట్లు వెలగడం లేదు..
శంషాబాద్ లాంటి ప్రధాన ప్రాంతంలో రైల్వే కమాన్ నుంచి బస్స్టాండ్ వరకు వీధిలైట్లు వెలగకపోవడం బాధాకరం. రాత్రి వేళల్లో మహిళా ఉద్యోగులు, ప్రయాణికులు భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.
చేవెళ్ల మహేందర్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇంచార్జి






