28 February, 2026 | 6:06 AM

బంధం బలోపేతం!

27-02-2026 12:00 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పొచ్చు. నిజానికి ఇజ్రాయెల్‌తో భారత్ ఎప్పుడు సఖ్యతగానే మెలుగుతూ వస్తున్నది. ఆ దేశం నుంచి అత్యధిక ఆయుధాలు కొనుగోలు చేస్తు న్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2017లో మోదీ తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనతో పోలిస్తే ఈ దఫా మోదీ టూర్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

తొమ్మిదేళ్ల కిందట మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు అక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ మధ్య కాలం లో గాజా, ఇరాన్‌పై భీకర దాడుల తర్వాత మోదీ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ దఫా పర్యటనలో ఇరు దేశాలు కీలక ఒప్పం దాలపై సంతకాలకు మాత్రమే పరిమితం కాలే దు. భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య అనేక విషయా లు కూడా చర్చకు రావడం ముదావహం.

ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటన మొదలైన మరుక్షణమే నెతన్యాహు ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి మరీ ఎయిర్‌పోర్టుకు వచ్చి మన ప్రధానికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ పార్లమెంటు ‘కనెసెట్’లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అది ప్రతిచోటా శాంతికి ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.

కలిసికట్టుగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇజ్రాయెలీలు కూడా ఉన్నారని, ఇజ్రాయెల్‌లాగే భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోదని మోదీ తెలిపారు. మానవత్వం ఎప్పు డు సంఘర్షణకు బలి కాకూడదని, గాజా శాంతి ప్రణాళికకు భారత్ పూర్తి మద్దతు ఉంటుందని మోదీ ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీని ఆకాశానికెత్తారు.

పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం అంద రినీ కదలించిందని, ఆయన మిత్రుడు మాత్రమే కాదని, సోదరుడి కంటే ఎక్కువని ఆకాశానికెత్తారు. ప్రపంచవ్యాప్తంగా యూదులపై దాడులు జరిగినప్పటికీ, భారత్ మాత్రం యూదులను ఎన్నడూ వేధించలేదని, పైగా సాదరంగా ఆహ్వానించిందని నెతన్యాహు గుర్తుచేసుకున్నారు. ఈ దఫా పర్యటనలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఏఐ, వ్యవసాయం, యూపీఏ చెల్లింపులు తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.

2024---25 ఆర్థిక సంవత్సరంలో భారత్, ఇజ్రాయెల్ వాణి జ్యం సుమారు 3.75 బిలియన్ డాలర్లకు చేరింది. వజ్రాలు, పెట్రోలియం, రసాయనాలు ప్రధాన వాణిజ్య వస్తువులు కాగా, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, హైటెక్ ఉత్పత్తులు, వైద్య పరికరాల రంగాలకు ఇది విస్తరించనుంది. 2025లో ద్వుపాక్షిక పెట్టుబడి ఒప్పందం కూడా కుదిరింది. ఇరు దేశాల మధ్య త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగనున్నట్లు ప్రకటించడం శుభపరిణామమని చెప్పొచ్చు.

ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ మూడో స్థానానికి చేరుకునేందుకు వడివడిగా అడుగులేస్తున్నది. మరోవైపు నవ కల్పన లు, సాంకేతిక నాయకత్వానికి ఇజ్రాయెల్ పవర్‌హౌస్‌గా నిలుస్తోంది. ఈ రెండు దేశాల కలయికతో భద్రత, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాల్లో కొత్త దశ ప్రారంభమైనట్లే!