బీసీ కులాలపై వివక్ష!
డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ :
కాలంతో పరిగెడుతున్న కుల సమాజంలో బతుకుతున్న ఒక కులపోల్లం! కులం ఎక్కడ అంటూ ప్రశ్నించే కుహనా మేద సంతతికేం తెలుసు మా కుల బాధలు. వినండి చెబుతాం.
ఒరేయ్...గంగిరెద్దులోడా..
ఒరేయ్... పిచ్చకుంట్లోడ..
ఒరేయ్...గమ్ములోడ..
ఒరేయ్.. మున్నూరోడ..
ఒరేయ్..గొల్లోడా..
ఒరేయ్.. శాలోడా..
ఒరేయ్.. చాకలోడా..
ఒరేయ్.. తెనుగోడా..
ఒరేయ్ మంగళోడా..
అంటూ మమ్మల్ని ఒక తిట్ల కులాలకు చిరునామాగా మార్చేశారు. అలా మార్చేసిన కుల సమాజంలో బతుకుతున్న ఒక కులపోడి బాదలు అగ్ర కులాలకు ఎలా తెలుస్తయి. ముఖ్యంగా రెడ్లకు, చలామణి అయ్యే రాజకీయ బడా బాబులకు ఏం తెలుస్తయి మా కులపోల్ల బాధలు. ఈ కాలానికి తగ్గట్టు బీసీల అణిచివేత, అవమానాలు లేకుండా పోలేదు. ఇప్పటికే బీసీ కులాలను రాజకీయాల్లోకి రాకుండా కులం పేరుతో తక్కువగా చూస్తున్నారు.
ఆధిపత్య కులాల వాళ్లు బీసీ కులాలపై వివక్ష చూపించడం తెలంగాణలో ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఈ రాష్ర్టంలో రెడ్లు, వెలమలు గ్రామాలను తమ ఆధీనంలో పెట్టుకొని కులం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు. ఆధిపత్య కులాల వారి కుట్రలు బీసీలకు తెలియ నంత కాలం రాజకీయంగా లబ్ధి పొందుతూనే ఉంటారు. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా బలపడకపోవడానికి కారణం రెడ్లు, వెలమలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గత 70 సంవత్సరాల నుంచి బీసీలను కులం పేరుతో చిన్నచూపు చూసి వివక్ష చూపించారు. కులం పేరుతో దుర్భాషలాడారు. రెడ్డి మహిళలు ‘మల్లిగా.. ఓ మున్నూరోడా’ అని పలుకుతూ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, శవయాత్రలు నిర్వహించారు. తీన్మార్ మల్లన్న స్వయం గౌరవాన్ని దెబ్బతీసే కుట్రకు తెర తీశారు. కావున బీసీలకు అట్రాసిటీ చట్టం తీసుకొస్తేనే రెడ్ల నుంచి రక్షణ పొందుతారన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఆదిపత్య కులాలు బీసీల సంపదను ఒకవైపు పన్ను రూపంలో తింటూనే, కుల వివక్ష చూపించి అభివృద్ధికి దూరం చేస్తున్నారు. మొత్తం బీసీలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిం చే ప్రతి బీసీ ప్రజా ప్రతినిధులను, ఆధిపత్య కులాల అహంకార పూరితాన్ని ప్రదర్శించడాన్ని ఖండిస్తున్నాం. సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకమై ఉద్యమానికి నడుం బిగించాలి. బీసీలు వివిధ కులాలుగా విడిపోయి ఉన్నారు
కాబట్టి వారిలో ఐక్యత ఉండదు అని పార్టీలు ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నంతకాలం బీసీలను బలమైన ప్రభావిత శక్తిగా పార్టీలు గుర్తించవు బీసీలకు అవకాశాలు ఇవ్వటానికి ముందుకు రావు కానీ పార్టీలు, ప్రభుత్వాలు గమనించాల్సిన ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి ఐక్యత లేకపోయినా బలహీన వర్గాల సమాజం తమకు జరుగుతు న్న అన్యాయాన్ని వివక్షతను గుర్తించటమే కాదు వివిధ సమస్యలపై ఉద్యమించే చైతన్యం పెరగటం భవిష్యత్తు అధికారానికి బాట వేస్తుంది. బీసీ కులాల సామాజిక రక్షణ కోసం ప్రభుత్వం అట్రాసిటీ రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరముంది.




