02-02-2026 02:55:58 AM
బడ్జెట్‌లో 7.84 లక్షల కోట్లు కేటాయింపు
గతేడాదితో పోలిస్తే 15 శాతం అదనం
సాయుధ దళాల ఆధునీకరణకు 2.19 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గతేడాది మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా నుంచి భద్రతా సవా ళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగాన్ని పటిష్టపరిచేందుకు బడ్జెట్‌లో రూ. 7,84, 678 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2025 బడ్జెట్‌లో ఇదే రక్షణ రంగానికి రూ.6, 81, 210 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి 15 శాతం నిధు లు అదనంగా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో మూలధన వ్యయం రూ. 2,19, 306 కోట్లుగా నిర్ణయించగా, రెవెన్యూ వ్యయం రూ. 5,53, 668 కోట్లుగా ఉంది. ఇందులో పెన్షన్లకు రూ. 1,71,338 కోట్లు ఉన్నాయి. ఇక దేశ భద్రత దృష్ట్యా ఈసారి సాయుధ దళాల ఆధునీకరణకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
సాయుధ దళాల ఆధునీకరణ కోసం 2.19 లక్షల కోట్లు కేటాయించగా.. వీటిలో విమానాలు, ఏరో ఇంజిన్లకు రూ. 63,733 కోట్లు, నావికా దళానికి రూ. 25,023 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇక 2025 లో మూలధన వ్యయం రూ. 1,80,000 కోట్లుగా అంచనా వేయగా, సవరించిన తర్వాత వ్యయాన్ని రూ. 1,86, 454 కోట్లకు పెంచారు. ఈ ఏడాది రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడంతో పా టు పలు కీలక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు నిర్మ లా సీతారామన్ తెలిపారు. పౌర శిక్షణ, ఇతర విమానాల తయారీకి అవసరమయ్యే భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు తెలిపారు.
దీంతో పాటు రక్షణ రంగ విభాగాల నిర్వహణ, మరమ్మత్తుల కోసం వినియోగించే విమాన భాగాల తయారికి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు చర్యలు రక్ష ణ రంగ అభివృద్ధితో పాటు ఏరోస్పేస్ రంగానికి ఊతమివ్వనున్నట్లు తెలిపారు. కాగా మాజీ సైనికుల సహకార ఆరోగ్యం పథకం కింద రూ. 12,100 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది సుమారు 45 శా తం ఎక్కువ అని ఆమె పేర్కొన్నారు. ఇక 2026 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన నిధులకు సంబంధించి అంచనా వేసిన జీడీపీ సుమారు రెండు శాతంగా ఉందన్నారు.
రక్షణ కేటాయింపుల ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వనరులను సరైన రీతిలో ఉపయోగిం చడం ద్వారా సరళీకృత సేకరణపై దృష్టి పెట్టినట్లేనని పేర్కొన్నారు. కాగా గతేడాది ఏప్రిల్‌లో పహ ల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పీవోకే ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొని అత్యాధునిక క్షిపణులతో పాక్‌లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయడంలో విజయవంతమయ్యారు. భారత్ అమ్ములపొదలోని సుదర్శన్ ఎస్ క్షిపణితో పాటు యుద్ధ ట్యాంకులు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే కాంక్షతోనే ఈసారి బడ్జెట్‌లో ఈ రంగంలో సాయుధ దళాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది.
ఏఐ రంగానికి వెయ్యికోట్లు
‘ఇండియా ఏఐ మిషన్’ పేరుతో స్టార్టప్‌లకు ఊతం
అతి తక్కువ ధరకు స్టార్టప్ కంప్యూటింగ్ సౌకర్యం
ఎంటర్‌ప్రెన్యూర్స్, స్కాలర్స్‌కు ౧౫% రాయితీ
20 వేల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏఐ ల్యాబ్‌లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. ‘ఇండియా ఏఐ మిషన్’ పేరుతో బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించింది. తద్వారా ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు తక్కువ ధరకు ‘స్టార్టప్ కంప్యూటింగ్’ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ స్కీం ద్వారా స్టార్టప్‌లు ప్రారంభించే ఔత్సాహికులు,పరిశోధకులకు క్లౌడ్ మౌలిక వసతులపై 15 శాతం వరకు రాయితీ లభిస్తుంది. లేదంటే నిర్ణీత కాలపరిమితితో కూడిన ఉచిత జీపీయూ సేవలు అందుతాయి. అధిక ఖర్చుతో కూడిన కంప్యూటింగ్ శక్తిని సామాన్య పారిశ్రామికవేత్తలకు చేరువ చేయడమే ఈ స్కీం ప్రధాన ఉద్దేశం. అలాగే కేంద్రం ‘డీప్ టెక్’ ఏఐ స్టార్టప్‌లకూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. నిధి ద్వారా స్వదేశీ ఏఐ మోడల్స్ అభివృద్ధి చేసే సంస్థలకు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే కేంద్రం ఐటీ సేవల విభాగానికి కల్పించే సేఫ్ హార్బర్ రాయితీ పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు పెంచింది. ఈ నిర్ణయంతో చిన్న తరహా ఏఐ కంపెనీలపై పన్నుల భారం తగ్గుతుంది.
డేటా సెంటర్లకు ప్రత్యేక హోదా
డేటా సెంటర్ల నిర్వహణను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం వాటికి ‘వ్యూహాత్మక మౌలిక వసతుల’ హోదా కల్పించింది. ఈ నిర్ణయంతో ఏఐ హార్డ్వేర్, జీపీయూ దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుంది. డేటా సెంటర్ల స్థాపనకు తక్కువ వడ్డీకే కంపెనీలకు దీర్ఘకాలిక రుణాలు పొందే అవకాశం కలుగుతుంది. విదేశీ క్లౌడ్ సేవా సంస్థలు భారతదేశంలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తే వారికి 2047 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. రాయితీలతో భారత్ ప్రపంచ ఏఐ సేవల మార్కెట్‌లో తన వాటాను గణనీయంగా పెంచుకోనుంది.
ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్’ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఏఐతో ప్రభావితమయ్యే సేవా రంగాలను గుర్తించి, అందుకు అవసరమైన శిక్షణ అందేలా చూస్తుంది. శిక్షణ పొందే ఒక్కే అభ్యర్థికి నెలకు రూ.11,800 వరకు ‘ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం’ ద్వారా ఉపకార వేతనం అందుతుంది. అలాగే దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ ప్రభుత్వ పాఠశాలలు, 500 కళాశాలల్లో అత్యాధునిక ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యా రంగంలో ఏఐ ఆధారిత బోధనను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ నెలకొల్పనుంది.
హెచ్‌ఆర్, కన్సల్టింగ్ రంగాలకు ఊరట
మానవ వనరుల సర్వీసులపై టీడీఎస్ తగ్గింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: మానవ వనరులు (హెచ్‌ఆర్), కన్సల్టింగ్ సేవల రంగానికి కేంద్ర ప్రభుత్వం పన్ను నుంచి కొంత ఊరట కల్పించింది. మానవ వనరులు సమకూర్చే సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఇకపై కాంట్రాక్టర్ పేమెంట్లుగా పరిగణించనుంది. తాజా నిర్ణయంతో టీడీఎస్ పన్ను స్థానంలో, కేవలం 1 శాతం పన్ను మాత్రమే ఆయా సంస్థలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో కన్సల్టింగ్ రంగంలోని సంస్థల్లో నగదు లభ్యత పెరుగుతుంది. అంతేకాకుండా.. కన్సల్టింగ్ సేవల రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించినట్లవుతుంది. తమ సిబ్బందిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే సేవా రంగంలోని చిన్న, మధ్య తరహా కన్సల్టింగ్ సంస్థలకు జీఎస్టీ పరంగానూ ఊరట లభించింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఆగిపోవడం వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు రీఫండ్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయనుంది.
విద్యా రంగానికి పెద్ద పీట
బడ్జెట్‌లో 1.39 లక్షల కోట్లు కేటాయింపు
గతేడాదితో పోలిస్తే 8.27 శాతం అదనం
ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు.. జిల్లాకో బాలికల హాస్టల్
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఊరట
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యా రంగానికి పెద్ద పీట వేశారు. ఈసారి బడ్జెట్‌లో రూ. 1,39,289 కోట్లు కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ. 55,727 కోట్లు కేటాయించడం జరిగింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధుల కేటాయింపు 8.27 శాతం అధికంగా ఉంది. కాగా ఈసారి విద్యా శాఖలో లాజిస్టిక్ కారిడార్ల సమీపంలో ఐదు విశ్వవిద్యాలయాల టౌన్‌షిప్‌ల ఏర్పాటు, దేశంలో ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కల్పించేలా సరళీకృత చెల్లింపు పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశాలకు పంపే విద్యా నిధులపైటాక్స్ కలెక్టడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను తగ్గిస్తూ ప్రకటన చేయడం ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో ఐదు విశ్వవిద్యా లయాల టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్న ట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఈ అకడమిక్ జోన్లలో పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్య కేంద్రాలు, నివాస సముదాయాలు ఉండేలా ప్రణాళికలు రచించనున్నారు.
వసతి గృహాల నిర్మాణం..
ఉన్నత విద్యకు సంబంధించి స్టెమ్ ఇన్‌స్టిట్యూట్‌లలో గంటల తరబడి విద్యార్థినులు చదువుకోవడం, ప్రయోగశాలల్లో ఉండడం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థినుల కోసం వీజీఎఫ్/మూలధన సహకారం ద్వారా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం 700 జిల్లాలు ఉన్నట్లు మంత్రి సీతారామన్ వివరించారు. ఇక ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సహాయ సహకారాలతో దేశవ్యాప్తంగా 15 వేల పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి..
విదేశీ విద్యా నిధుల ప్రవాహం తగ్గుము ఖం పడుతున్న తరుణంలో కేంద్ర మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సరళీకృత చెల్లింపు పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశాలకు పంపే విద్యా నిధులపై టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. తాజా ప్రతిపాదనతో రూ. 10 లక్షల కన్నా ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పంపేవారికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుందని స్పష్టం చేశారు. ఇక వికసిత్ భారత్కు సేవల రంగాన్ని కీలక చోదక శక్తిగా మార్చడంపై దృష్టి సారింంచే చర్యలను ఈ బడ్జెట్‌లో నిర్మలమ్మ సిఫార్సు చేశారు. ఇందుకోసం ఉన్నతస్థాయి ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయిమెంట్ అండ్ ఎంటర్‌ప్రైజ్’ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
దీనివల్ల 2047 నాటికి ప్రపంచ సేవల రంగంలో 10 శాతం వాటాతో దేశం అగ్రగామిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. వృద్ధి , ఉపాధి, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ కమిటీ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై ఏఐ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రభావాలను అంచనా వేసి తదనుగుణంగా చర్యలను ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనలతో విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఇకపై తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై తక్షణ నగదు భారం తగ్గుతుంది. టీసీఎస్ అనేది అదనపు పన్ను కాదు. దీన్ని ఐటీ రిటర్నుల ద్వారా తిరిగి పొందవచ్చు.
నేషనల్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు..
దేశంలో డిజైనింగ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డిజైనర్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో తూ ర్పు భారతదేశంలో డిజైనింగ్ విద్య, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక నూతన నేషనల్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఐ) ఏర్పాటుకు సన్నా హకాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీతారామన్ వివరించారు. ఆస్ట్రోఫిజిక్స్, ఖగోళ శాస్త్రాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నాలుగు టెలిస్కోప్ మౌ లిక సదుపాయాల సంస్థలను ఏర్పా టు లేదా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీటిలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్ ప్లానిటోరియం ఉన్నాయి.
క్రీడారంగంపై కాసుల వర్షం
ఖేలో ఇండియా మిషన్ రోడ్‌మ్యాప్ ఆవిష్కరణ
క్రీడారంగానికి రూ.45 వేల కోట్లు
2025 కంటే రూ.2800 కోట్లు పెంపు
న్యూఢిల్లీ , ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌లో భారత క్రీడారంగానికి మరోసారి ప్రాధాన్యత దక్కింది. 2026027 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడాశాఖకు కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించింది. భారత క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసు కెళ్లే లక్ష్యంతో రానున్న పదేళ్లకు గానూ ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా మిషన్ రోడ్‌మ్యాప్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు.
కేవలం పతకాలు గెలవడం కోసమే కాకుండా కోట్లాది మందికి ఉపాధి కల్పించేలా క్రీడారంగాన్ని తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. క్రీడలను ఒక ఆటగానే కాకుండా ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన రంగంగా ప్రభుత్వం గుర్తి స్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా గత కొన్నేళ్లుగా భారత క్రీడారంగంలో అద్భుతమైన నైపుణ్యాన్ని వెలికి తీసామని, ఇప్పుడు వచ్చే పదేళ్ల కోసం భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్టు చెప్పారు. దీని కోసం ఈ సారి నిధులు కేటాయింపును మరింతగా పెంచినట్టు ఆమె వెల్లడించారు. తాజా బడ్జెట్‌లో క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించి రూ.45,482 కోట్లు కేటాయించారు.
గత ఏడాది రూ.42,692 కోట్లు కేటాయించగా.. ఈ సారి దాని కంటే రూ.2800 కోట్లు అదనంగా పెంచారు. కేంద్రం కొత్తగా ప్రకటించిన పదేళ్ల రోడ్ మ్యాప్ అమలు చేసేందుకు ఈ నిధులు కీలకం కానున్నాయి. 2030లో అహ్మదాబాద్ వేదికగా నిర్వహిం చనున్న కామన్‌వెల్త్‌గే మ్స్ కోసం, 2036 ఒలింపిక్స్ బిడ్ కోసం స్టేడియాల ఆధునీకరణ, శిక్షణా కేంద్రాల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కోసం వెచ్చించనున్నారు. ఖేలో ఇండియా మిషన్ ద్వారా స్వల్పకాలిక ఖర్చుల కంటే దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. క్రీడాకా రులు పతకాలు గెలుచుకునేందుకే కాకుండా యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
క్రీడారంగంలో కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్రీడా పరికరాల తయారీ వంటి విభాగాల్లో భా రీగా ఉద్యోగావకాశాలు కల్పించడం కూడా ఈ నిధుల కేటా యింపు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కోచింగ్ , మేనేజ్‌మెంట్ విభాగంలో సర్టిఫైడ్ కోచ్‌లు, హై పెర్మార్మెన్స్ డైరెక్టర్లు, టాలెంట్ స్కౌట్లకు డిమాండ్ పెరుగు తుంది. అలాగే స్పోర్ట్స్ సైన్స్‌లో ఫిజియోథెరపిస్టులు, స్పోర్ట్స్ సైకలాజిస్టులు, న్యూటిషినస్టులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇక మేక్ ఇన్ ఇండియాలో భా గంగా నాణ్యమైన క్రీడాపరికరాలను దేశీయం గా తయారు చే యడం ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా ఖేలో ఇండియా కార్యక్రమానికి కేంద్రం ప్రాధాన్య తనిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో క్రీడారంగం కూడా కీలకపాత్ర పోషించేలా కేంద్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను క్రీడావర్గాలు ప్రశంసిస్తున్నాయి.
కాంచీపురం చీరలో నిర్మల
బంగారు, కాఫీ వర్ణం అంచుతో మెజెంటా రంగు చీర
గోల్డెన్ కలర్ బ్లౌజ్, కుడి భుజంపై శాలువాతో బడ్జెట్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ లా సీతారామన్ ధరించే చీరలపై దేశ ప్రజలందరికీ ప్రత్యేక దృష్టి ఉంటుంది. చేనేత చీరలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే నిర్మల.. ఈసారి కూడా చేనేత చీరనే ధరించి తొమ్మిదోసారి లోక్‌సభలో బడ్జె ట్‌ను ప్రవేశపెట్టారు. ఆదివారం ఆమె కాంచీపురం చీరలో కన్పించారు. ఆ చీర బంగారు, కాఫీ వర్ణ పు అంచుతో మెజెంటా రంగులో ఉన్నది. బంగారపు రంగు బ్లౌజ్, కుడి భుజంపై శాలువాతో కన్పించారు. అయితే త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ కాంచీపురం చీరతో కనిపించడం.. ఆ రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేందుకేనని పలువురు చర్చించుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ గత ఎనిమిదేళ్లుగా వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ ధరించిన చీరల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
F2025 బంగారపు అంచుతో గోధుమవర్ణం చీరను ధరించారు. ఎరుపు రంగు బ్లౌజ్, చేపల ఆర్ట్‌తో ఉన్న శాలువాతో కనిపించారు. ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులా రీదేవి.. నిర్మలాసీతారామన్‌కు కానుకగా ఇచ్చారు.
F2024 ఈ ఏడాది ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు కాంతా చీరలో కన్పించారు. ఎన్నికల అనంతరం మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు తెలుపు రంగు, బంగారు మోటిప్‌లతో ఉన్న మెజెంటా అంచుతో ఉన్న చీరను ధరించారు.
F2023 ఈ ఏడాది గోధుమ రంగు (బ్రౌన్)లో టెంపుల్ బోర్డర్‌తో ఉన్న ఎరుపు రంగా చీరను నిర్మల ధరించారు.
F2022 ఈ ఏడాది ముదురు గోధుమ (మెరూన్) రంగు చీరను నిర్మల ధరించారు. ఒడిశాలో తయారు చేసిన చేనేత చీర.
F2021 ఈ ఏడాది నిర్మల తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎరుపు- గోధుమ రంగు కలగలిసిన చీరలో కనిపించారు.
F2020 పసుపు పచ్చ- బంగారు రంగులో నీలం రంగు అంచులో ఉన్న చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
F2019 తొలిసారిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ నిర్మలా సీతారామన్ మంగళగిరి గులాబీ రంగు చీరలో కనిపించారు. బడ్జెట్ పత్రాలు తెచ్చే పెట్టెకు బదులుగా బహీ ఖాతాతో దర్శనమిచ్చారు.
చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ
వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు
సరికొత్త మైలురాయిని చేరుకున్న ఆర్థిక మంత్రి
మొరార్జీ రికార్డును దాటి చిదంబరం సరసననిలిచిన నిర్మలాసీతారామన్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. ఆమె వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలిచారు. భారత పార్లమెంటరీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించగా, నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆ రికార్డును దాటిపోయారు. ఇప్పుడు 9వ సారి ప్రవేశపెట్టి తన రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నారు. మొత్తమ్మీద అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో పి చిదంబరం (9 సార్లు)తో ఆమె సమానంగా నిలిచారు. 10 బడ్జెట్లతో మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉండగా, సీతారామన్ రెండో స్థానానికి చేరుకున్నారు. అదేవిధంగా ఒకే ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) నాయకత్వంలో నిరంతరాయంగా 9 బడ్జెట్లు సమర్పించిన ఘనత కూడా నిర్మలమ్మకే దక్కింది. కాగా ప్రణబ్ ముఖర్జీ ఎనిమిదిసార్లు, మన్మోహన్ సింగ్ ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోస్థానానికి చేరేలా..
ఇది ప్రజాకేంద్రిత బడ్జెట్
పీపుల్స్ ఫ్రెండ్లీ పద్దును స్వాగతిస్తున్నాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి చేరుకునేలా బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. దేశప్రగతికి ఈ బబ్జెట్ ఎంతో తోడ్పడుతుందన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్‌ను తాము స్వాగతి స్తున్నామన్నారు. బడ్జెట్‌తో ప్రజలపై ఎటువంటి భారం లేదని, ఎక్కడ కూడా బడ్జెట్‌ను వేలెత్తి చూపేలా లేదని ఆయన పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన తర్వాత మీడియాతో రాంచందర్ రావు మాట్లాడారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశాన్ని దృఢంగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌కు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రకటనతో రాష్ర్టం జాతీయ వృద్ధి యంత్రంగా మరింత బలపడనుందని అన్నారు. ఇది మార్పును తీసుకొచ్చే బడ్జెట్ అని పేర్కొంటూ, ఆర్థిక బలము నుంచి జాతీయ సామర్థ్యానికి, అంత్యోదయం నుంచి అభ్యుదయానికి దేశాన్ని నడిపించే స్వర్ణయాత్రకు ఈ బడ్జెట్ పునాది వేస్తోందని చెప్పారు. పచ్చని పొలాలు, బలమైన ధాన్యాగారాలు, ప్రతి కుటుంబంలో చిరునవ్వులు--- ఇవన్నీ ఈ బడ్జెట్ లక్ష్యాలని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టి తో రూపొందిన ఈ బడ్జెట్ దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వడంతో పాటు, ఇంధన భద్రతను బలోపేతం చేస్తోందని, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా కీలక సంస్కరణలను తీసుకొస్తోందని అన్నారు.
ఉపాధి సృష్టి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, కొనుగోలు శక్తి వృద్ధి, నాణ్యమైన విద్యా--వైద్య సేవల విస్తరణకు ఈ బడ్జెట్ బలమైన పునాదిని వేస్తోందన్నారు. ఈ నిరంతర విధానాల ఫలితంగా భారతదేశం సుమారు 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని, పేదరికం తగ్గింపులో చారిత్రాత్మక పురోగతి సాధించిందని తెలిపారు. ప్రతి వర్గాన్ని వెంట తీసుకెళ్లే ఈ వికసిత్ భారత్ బడ్జెట్ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కీలకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం, రైతు ల సౌభాగ్యం, మహిళల సాధికారత, యువత ఆశయాలకు అంకితమైన ఈ ప్రజాకేంద్రిత బడ్జెట్‌ను ప్రవేశపె ట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన కతజ్ఞతలు తెలిపారు.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీ--ఎస్టీ సంక్షేమానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉపాధి, విద్య, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివద్ధి వంటి కీలక రంగాల భవిష్యత్తును విస్మరించింది. రాష్ట్రాన్ని అర్బన్ కోర్, పెరి అర్బన్, --గ్రామీణ తెలంగాణగా మూడు జోన్లుగా విభజించి సమాన, సుస్థిర అభివద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలు చేస్తుంటే తెలంగాణ రైజింగ్‌కు కేటాయింపులేవు. సెమీకండక్టర్ సిటీలు, ఎనర్జీ పార్కులు, ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్లు, డ్రైపోర్టులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇందిరా మహిళా శక్తి మిషన్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. వ్యవసాయం, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, హరిత విద్యుత్తు వంటి రంగాల్లో అభివృద్ధికి కేంద్ర సహకారం కరువైంది.
అడ్లూరి లక్ష్మణ్