calender_icon.png 2 February, 2026 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయహో ‘నారీశక్తి’!

02-02-2026 03:25:49 AM

కేంద్ర పద్దులో మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యం l రికార్డు స్థాయిలో 5.08 లక్షల కోట్లు కేటాయింపు 

 గతేడాది కేటాయింపుతో పోలిస్తే ౧౩% పెంపు l మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ‘షీ మార్ట్స్’

గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు.. సై

‘లఖ్‌పతి దీదీ’ పథకం ద్వారా ౩ కోట్ల మందిని లక్షాధికారులు చేసే లక్ష్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యమిచ్చింది. మహిళల అభ్యున్న తి, వారి కోసం అమలు చేసే పథకాల కోసం ‘నారీశక్తి’ పేరిట ఏకంగా రూ.5.08 లక్షల కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.4.49 లక్షల కోట్లు కేటాయించ గా, ఈసారి ఆ నిధులను 13 శాతం పెంచిం ది. మొత్తం బడ్జెట్‌లో మహిళల వాటా 9శాతం ఉండటం విశేషం. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ‘షీ మార్ట్స్’ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

వీటి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా, సభ్యులు స్వయంగా షీమార్ట్స్‌లో విక్రయించుకునేలా గ్రామీణ అవుట్‌లెట్లు అందుబా టులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఈ విధానం ద్వారా మహిళలు రుణ గ్రహీతలు మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగానే ప్రతిష్ఠాత్మకంగా ‘లఖ్‌పతి దీదీ’ పథకం అమలు చేయనున్నది. పథకంలో భాగంగా ఏటా 3కోట్ల మంది మహి ళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఊతమిస్తుంది.

యువతుల ఉన్నత విద్యపై దృష్టి

ఉన్నత విద్యను అభ్యసించే యువతుల కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 800 జిల్లాల్లో యువతుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు ని ర్మించనుంది. హాస్టళ్ల ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన పరిశోధక విద్యార్థినులకు వసతి సమస్యలు లేకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. హాస్టళ్ల నిర్మాణం వల్ల గ్రా మీణ ప్రాంతాలకు చెందిన యువతులు ఉన్నత చదువులకు దూరం కాకుండా ఉం టారని, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రాల్లో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.

మహిళా, శిశు సంక్షేమంపై

మహిళా, శిశు సంక్షేమంపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఆ మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.28,183 కోట్లు కేటాయించింది. మహిళల ఆరోగ్యసంరక్షణ కోసం ‘యు-విన్’ డిజిటల్ ఫ్లాట్‌ఫాంను అందుబాటులోకి తేనుంది. కేంద్రం దీని ద్వారా యేటా 2.5 కోట్ల మంది గర్భిణులు, 2.5 కోట్ల మంది పిల్లల టీకాలను ట్రాక్‌చేయనుంది.అలాగే మత్స్య రంగంలోనూ మహిళల పాత్రను పెంచేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ఆ రంగంలో మహిళలు స్టార్టప్స్ ప్రారంభించేందుకు, ఫిష్ ఫార్మర్స్‌గా ఎదిగేందుకు అండగా నిలువనుంది. మరోవైపు కేంద్ర పద్దుపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదిసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక చరిత్ర, మహిళా శక్తికి నిదర్శనమని కొనియాడారు.

‘మిషన్ శక్తి’ పథకానికి రూ.3,605 కోట్లు

మహిళల భద్రత, సాధికారతకు అమలు చేయనున్న ‘మిషన్ శక్తి’ పథకానికి కేంద్రం ఆర్థిక దన్నునిచ్చింది. దీనిలో భాగంగానే పథ కానికి రూ.3,605 కోట్లు కేటాయించింది. గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త ఉపాధి పథకం ద్వారా మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. మహిళలు ఇంటి వద్ద నీటి కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో ‘జల్ జీవన్ మిషన్’కు రూ.67,670 కోట్లు కేటాయించింది. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ఈ నిధులను వినియోగించ నున్నది. అలాగే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘ముద్ర’ రుణపరిమితిని కూడా కేంద్రం పెంచింది. 

ఆరోగ్యానికి భరోసా

బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.1,04,599 కోట్లు కేటాయింపు

గతంతో పోలిస్తే 10 శాతం పెరుగుదల

సంక్షేమ విభాగానికి రూ.101,709.21 కోట్లు

మూడు ఆయుర్వేద కేంద్రాల ఏర్పాటు

రాబోయే ఐదేళ్లలో లక్ష మంది ఏహెచ్‌పీలు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 సంబంధించి- రూ. 53.47 లక్షల కోట్లతో పార్లమెం ట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వైద్యారోగ్యశాఖకు  2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,06,530.42 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఇది 2025- పోలిస్తే 10 శాతం పెరుగుదల. ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ. 1,01,709.21 కోట్లు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.4,821.21 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

మొదటిసారిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణుల (ఏహెచ్‌పీ) పథకం కోసం రూ.1,000 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కోసం కేటాయింపులు 2025- రూ.37100.07 కోట్ల నుంచి 2026 రూ.39,390 కోట్ల కు పెంచబడ్డాయి. అంతేకాకుండా, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కోసం రూ.8,995 కోట్ల నుంచి రూ.9,500 కోట్లకు బడ్జెట్‌ను పెంచా రు. ఇది 5.6 శాతం పెరుగుదలను సూచిస్తుంది. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కోసం బడ్జెట్ కేటాయింపును స్వల్పంగా రూ.45 కోట్ల నుంచి రూ.51 కోట్లకు పెంచారు.

జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్‌కు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.324.26 కోట్ల నుంచి రూ.350 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి గల సంస్థల కోసం బడ్జెట్ కేటాయింపు 2024- రూ.21,901.98 కోట్ల నుంచి 2026 రూ.22,343.97 కోట్లకు పెరిగింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కోసం కేటాయింపును రూ.5,238.70 కోట్ల నుంచి రూ.5500.92 కోట్లకు పెంచగా, ఐసీఎంఆర్‌కు రూ.4821.21 కోట్లు కేటాయించారు. ఇది సుమారు 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక దేశంలో కొత్తగా మూ డు ఆయుర్వేద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఉత్తర భారత్‌కు నిమ్హాన్స్ 2.0..

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉత్తర భారతదేశంలో రెండో జాతీయ మానసిక ఆరోగ్యం, నాడీ శాస్త్రాల సంస్థ (నిమ్హాన్స్)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి నిమ్హాన్స్ బెంగళూరులో ఉంది. పార్లమెంటులో 2026- కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, రాంచీ (జార్ఖండ్), తేజ్పూర్ (అస్సాం)లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను కూడా ప్రాంతీయ అగ్రశ్రేణి సంస్థలుగా ఆధునికీకరిస్తామని సీతారామన్ తెలి పారు.

‘ఉత్తర భారతదేశంలో మానసిక ఆరో గ్య సంరక్షణ కోసం జాతీయ సంస్థలు లేవు. అందువల్ల, మేము ఒక నిమ్హాన్స్-2ను ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలను, ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలను ఊహించని ఖర్చులకు గురిచేస్తాయని పేర్కొన్నారు. కావున ‘అత్యవసర ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ఆసుపత్రుల్లో ఈ సామర్థ్యాలను 50 శాతం బలో పేతం చేసి, పెంచుతాం’ అని ఆమె చెప్పారు. 

మెడికల్ టూరిజం..

దేశంలో వైద్య పర్యాటకానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రా లను స్థాపించడంలో రాష్ట్రాలకు మద్దతు ఇచ్చే పథకాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ కేంద్రాలు వైద్య, విద్య, పరిశోధన సౌకర్యాలను కలిపే సమగ్ర ఆరోగ్య సంరక్షణ సముదాయాలుగా పనిచేస్తాయని సీతారామన్ చెప్పారు. వీటికి ఆయుష్ కేంద్రాలు, వైద్య విలువ పర్యాటక సౌకర్యాల కేంద్రాలు, డయాగ్నస్టిక్స్, పోస్ట్ కేర్, పునరావాసం కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కేంద్రాలు వైద్యులు, అనుబంధ ఆరోగ్య నిపుణులతో సహా ఆరోగ్య నిపుణులకు విభిన్న ఉద్యోగ అవకాశాలను అందిస్తాయని ఆమె చెప్పారు. 

ఆయుర్వేదానికి ఊతం..

కొవిడ్ తర్వాత ఆయుర్వేదం యోగా వంటి ప్రపంచ ఆమోదం, గుర్తింపును పొందిందని స్పష్టం చేశారు. ఈ రంగంలో పరిశోధనలను బలోపేతం చేయడానికి మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ఇవి నాణ్యమైన ఆయుర్వేద ఉత్పత్తులను అన్వేషించడం వల్ల మూలికలను పెంచే రైతులకు, ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యువతకు సహాయపడుతాయని ఆమె చెప్పారు. ఈ మూడింటి తోపాటు ఆయుష్ ఫార్మసీలు, ఔషధ పరీక్షా ప్రయోగశాలలను ఉన్నత ప్రమాణాల ధ్రువీకరణ పర్యావరణ వ్యవస్థ కోసం అప్‌గ్రేడ్ చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించామని పేర్కొన్నారు. సాంప్రదాయ వైద్యం కోసం ఆధారాల ఆధారిత పరిశోధన, శిక్షణ, అవగాహనను పెంచడానికి జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను ఆధునికీకరించాలని కూడా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు..

భారతదేశాన్ని ప్రముఖ వైద్య పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రతిపాదించింది. ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాలు వైద్య, విద్య, పరిశోధన సౌకర్యాలను మిళి తం చేసే సమీకృత ఆరోగ్య సంరక్షణ సముదాయాలుగా పనిచేస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు.

అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణుల (ఏహెచ్‌పీ) కోసం ఇప్పటికే ఉన్న సంస్థలను ఆధునికీకరిస్తామని, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో కొత్త ఏహెచ్‌పీ సంస్థలను ఏర్పా టు చేస్తామని చెప్పారు. ‘ఇది ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా, ఓటీ టె క్నాలజీ, అప్లైడ్ సైకా లజీ, బిహేవియరల్ హెల్త్‌లో సహా 10 ఎంపిక చేసిన విభాగాలను కవర్ చేస్తుంది. రాబోయే ఐదేళ్లలో లక్ష మంది ఏహెచ్‌పీలను అదనంగా తయారు చే స్తుంది’ అని అన్నారు. రాబోయే సంవత్సరంలో 1.5 లక్షల మంది సంరక్షకులకు వెల్నెస్, యోగా, వైద్య, సహాయక పరికరాల నిర్వహణ వంటి అనుబంధ నైపుణ్యాలలో శిక్ష ణ ఇస్తామని సీతారామన్ చెప్పారు.

కేంద్ర బడ్జెట్ పరిమాణం 53,47,315 కోట్లు

మూలధన వ్యయం 12.2 లక్షల కోట్లు 

రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు

మూల ధన వసూళ్లు 18,14,165 కోట్లు

పన్నుల ద్వారా నికర రాబడి 28,66,922 కోట్లు 

పన్నేతర వసూళ్లు 6,66,228 కోట్లు 

కేటాయింపుల్లో రక్షణ రంగానిదే అగ్రస్థానం

ఏకంగా 7.85 లక్షల కోట్ల కేటాయింపు

వికసిత్ భారత్ ‘కర్తవ్య మంత్రం’: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పా ర్లమెంట్‌లో 2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు ఉండబోతున్నట్లు ప్రకటించారు. అలాగే పన్నుల ద్వారా రూ.28.66,922 కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. రూ.6,66,228 కోట్ల పన్నేతర ఆదా యం వస్తుందని అంచనా వేశారు. రుణాల రికవరీ రూ.38,397 కోట్లు, ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లని వివరించారు. అప్పు లు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు వస్తాయని అంచనా వేశారు.

ఇలా మొత్తంగా ఆదాయంరూ.53,47,315 కోట్లు వస్తుందని, వ్యయం కూడా రూ.53,47,315 కోట్లనే తెలిపారు. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానిది అగ్రతాంబూలం. కేంద్రం ఈ రంగానికి ఏకంగా 7.85 లక్షల కోట్ల కేటాయించింది. మూలధన వ్యయం 12.2 లక్షల కోట్లుగా ప్రకటించారు. ఈ నిధులను కేంద్రం ప్రధానంగా రైల్వేలు, జాతీయ రహదారులు, ఓడరేవులు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనుంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి సంబంధించి బడ్జెట్ ఒక రోడ్‌మ్యాప్ అని పేర్కొన్నారు. 

యువత అభ్యున్నతిని ఆకాంక్షింస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం మూడు కర్తవ్యాలు, ఆరు దశల ప్రక్రియ అవలంబిస్తుందన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన సేవలు అందించడమే తమ కర్తవ్యమన్నారు.  మధ్యతరగతి ప్రజల కు ఊరటనిచ్చేలా పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ’ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025’ను తీసుకురానున్నట్లు తెలిపారు. పన్ను చెల్లింపు ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ప్రాణాపాయ వ్యాధులకు సంబంధించిన 17 రకాల మందులపై కస్ట మ్స్ డ్యూటీని రద్దు చేస్తూ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తెచ్చారు. 

మూడు ప్రధాన కర్తవ్యాలు

అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచి అనిశ్చితి సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యాన్నిసముపార్జించడం.

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా దేశ శ్రేయస్సులో భాగస్వాములు చేయడం. వారిలో నైపుణ్యాలను పెంపొందించడం.

‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ దార్శనికతతో చిట్టచివరి కుటుంబానికీ వనరులు చేరవేయడం.

ఆరు దశల ప్రక్రియ

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పన: ఆధునిక రవాణా, డిజిటల్ మౌలిక వసతులు

యువశక్తి, ఉపాధి: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన

ఆవిష్కరణలు, పరిశోధన: టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి

సుస్థిర ఇంధనం: ఇంధన భద్రత, పర్యావరణ హిత వనరుల వినియోగం

సమ్మిళిత అభివృద్ధి: అణగారిన వర్గాలు, పేదల సాధికారత

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి: ఉత్పాదకత పెంపు

ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.O

కేంద్ర బడ్జెట్‌లో 40,000 కోట్ల కేటాయింపు

చిప్స్ తయారీలో ఇక భారత్ దూకుడు

ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ పథకానికి ఆర్థిక దన్ను

యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.O’కు మార్గం సుగమమైంది.  సెమీకండక్టర్ మిషన్ మొదటి దశ సత్ఫలి తాలనివ్వడంతో రెండోదశ మిషన్‌ను ప్రారంభించనున్నది. సెమీకండెక్టర్ల రంగానికి ఆర్థికపరమైన బలమిచ్చేందుకు కేంద్రం బడ్జెట్‌లో ఏకంగా రూ.40,000 కోట్లు కేటాయించింది. తద్వారా భారత్‌ను చిప్స్ తయారీ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. గతేడాది రూ.22,919 కోట్లు కేటాయించగా, ఈసారి దాదాపు రెట్టింపు నిధులు విడుదల చేయడం విశేషం. ఈ నిధులు ఎలక్ట్రానిక్ విడి భాగాలు తయారు చేసే కంపెనీలకు ఊతమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీం (ఈసీఎంఎస్) అమలు చేసి చిప్స్ తయారీ పెంపునకు బాటలు వేయనుంది. తద్వారా దేశంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నది.

అలాగే లక్షలాది మంది యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నది. ముఖ్యంగా రెండో దశలో చిప్ తయారీకి అవసరమైన పరికరాలు, ముడి పదార్థాలను దేశీయంగా ఉత్పత్తి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి సెమీకండక్టర్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు ‘శక్తి’ అనే కొత్త పథకానికి నాంది పలికింది. పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది. తద్వారా తన సొంత మేధో సంపత్తిని సృష్టించుకోనుంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పది ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అవిపూర్తయితే గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది.

27 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్

సెలవు రోజున ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

చివరిసారిగా 1999లో ఫిబ్రవరిలోశనివారం ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా 

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): భారత పార్లమెంటరీ చరిత్రలో 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది. సాధారణంగా సెలవు దినమైన ఆదివారం నాడు పార్లమెంటు కార్యకలాపాలు జరగవు. కానీ సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఆర్థిక మంత్రి సెలవు రోజైన ఆదివారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అరుదైన సందర్భానికి వేదికయ్యారు. చివరిసారిగా 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి చివరి శనివారం (ఫిబ్రవరి 27) నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఒక సెలవు దినం నాడు బడ్జెట్ రావడం ఇదే తొలిసారి. గతంలో బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం నాడు సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. యశ్వంత్ సిన్హా 1999 ఫిబ్రవరి ౨౭న సాయంత్రం 5 గంటల సంప్రదాయాన్ని మార్చి.. ఆ నెలలో చివరి రోజైన ఆదివారంనాడు కాకుండా ముందు రోజు శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ నేడు ఈసారి ఫిబ్రవరి 1న ఆదివారం దేశమంతా సెలవులో ఉన్నా, పార్లమెంటు మాత్రం ఈ చారిత్రక ఘట్టం కోసం ప్రత్యేకంగా సమావేశమైంది.

సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ అద్భుతం మళ్ళీ జరిగింది. ఒకప్పుడు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం నాడు సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. 2017 నుంచి మోదీ ప్రభుత్వం బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చింది. దీనివల్ల కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) ప్రారంభమయ్యే లోపు నిధుల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈసారి కూడా ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సెలవు రోజు కావడంతో పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు టీవీల ముందు చేరి బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా గమనించారు.