calender_icon.png 2 February, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కరకాలంగా వివక్షే..

02-02-2026 02:30:03 AM

  1. బడ్జెట్‌లో తెలంగాణకు మరోమారు అన్యాయం
  2. రాష్ట్రానికి నిధులు తేలేని నిస్సాహయతలో కాంగ్రెస్, బీజేపీ 
  3. కేంద్ర మంత్రులు, రేవంత్ వైఫల్యంతో తెలంగాణకు గుండు సున్న
  4. కేంద్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం పుష్కరకాలంగా వివక్షపూ రిత వైఖరి కొనసాగిస్తోందని ఆరోపించారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని, ఆయన ఢిల్లీలోని బీజేపీ పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షణల వల్ల కలిగిన ప్రయోజనంపైన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బడాబాయ్‌తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్భాలు పలికిన చోటాబాయ్ మాటలు అన్ని బూటకమే అని బడ్జెట్ సాక్షిగా తెలిపోయింది. తమ ‘బడే భాయ్ -- చోటే భాయ్’ అనుబంధం వలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమి సాధించిందో వెల్లడించాలని ప్రశ్నించారు.

కేవలం తనపై ఉన్న కేసులను, అవినీతి ఆరోపణల నుంచి కాపాడమని బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులపాటు ఢిల్లీ పర్యటనలు చేశారని  విమర్శించారు.  రేవంత్  చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మూసేందుకు, స్కాములపై విచారణ చేయకుండా, కేంద్రంలోని బీజేపీ నేతల వద్దకు వెళ్లడమే తప్ప తెలంగాణ హక్కుల కోసం కాదని  కేటీఆర్ మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనం 

మరోవైపు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని ఈ బడ్జెట్‌పై బీజేపీ నేతలు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నాటి నుంచి తెలంగాణకు దక్కవలసిన విభజన హామీల నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనమన్నారు.  రాష్ర్టం నుంచి పేరుకు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రజల పక్షాన కనీసం గొంతెత్తి అడగకపోవడం వల్లనే తెలంగాణకు చిల్లిగవ్వ కూడా కేంద్ర బడ్జెట్‌లో దక్కలేదని విమర్శించారు.

పాలమూరు సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, కొత్త రైల్వే లైన్లకు నిధులు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐటీ, ఐఐఎం, విద్యాసంస్థల ఏర్పాటు, ఖమ్మంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి అనేక కీలక డిమాండ్లపై తాము పదేళ్లకు పైగా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేసినా... ఏ ఒక్కదానికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. 

బహిరంగ క్షమాపణ చెప్పాలి 

తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఆయా పార్టీల ఎంపీలు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు తమ రాష్ట్రాలకు భారీగా నిధులు తెచ్చుకుంటుంటే, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్‌ఎస్ పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం వలన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్న విషయం తెలంగాణ సమాజానికి అర్థమయిపోయిందని కేటీఆర్ అన్నారు.