19 June, 2026 | 2:52 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

19-06-2026 12:28 AM

సత్తుపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడడంతో పాటు నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో సత్తుపల్లి పట్టణంలో గురువారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి, వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏవో సుజాత ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపులను, నవతా ట్రాన్పోర్ట్ ను సందర్శించి, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ, నిల్వల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు లేదా నాసిరకం పురుగుమందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. బిల్లు లేకుండా కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో భవిష్యత్తులో సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని తెలిపారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించే విత్తనాలు లేదా ఎరువుల గురించి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.