25 February, 2026 | 1:56 AM

పనిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

25-02-2026 12:16 AM

అధికారులకు కమిషనర్ల హెచ్చరిక

అత్తాపూర్, అమీన్‌పూర్, బోడుప్పలో పర్యటించిన జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, మల్కాజిగిరి కమిషనర్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మహానగరం, దాని చుట్టుపక్కల ప్రాంతా లను సంపూర్ణ పరిశుభ్ర నగరాలుగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ డోర్-టు-డోర్ కలెక్షన్, చెరువుల పరిరక్షణ పనుల తనిఖీలకు ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగారు.

మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ కమిషనర్ జి.సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తమ తమ కార్పొరేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పారిశుద్ధ్య లోపాలపై కిందిస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

జీహెచ్‌ఎంసీలో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ సిస్టమ్ 

ఇంటింటి చెత్త సేకరణలో జవాబుదారీతనం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. క్యూఆర్ కోడ్ ఆధారిత డోర్-టు-డోర్ చెత్త సేకరణ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందనగర్‌లో అమలు చేస్తోంది. మంగళవారం ఉదయం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఈ ప్రాజెక్టు పనితీరును కమిషనర్‌కు వివరించారు.

అనంతరం స్వచ్ఛ ఆటోల ద్వారా జరుగుతున్న చెత్త సేకరణను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల హాజరు, సూపర్ వైజర్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కమిషనర్ శానిటేషన్ రవికిరణ్, డీసీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.మరోవైపు సీఎం సీ కమిషనర్ జి. సృజన అమీన్‌పూర్ సర్కిల్‌లో విస్తృ త తనిఖీలు చేపట్టారు.

అమీన్‌పూర్ చెరువును సందర్శించిన ఆమె, నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ పర్యా వరణానికి హాని చేస్తున్న గుర్రపుడెక్కను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణానికి భంగం కలగకుండా చెరువు కట్ట వెంబడి వినోద, ప్రజా ఉపయోగ సదుపాయాల (పార్కులు) అభివద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

మల్కాజిగిరి నగర పాలక సంస్థ ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బోడుప్పల్ సర్కిల్ పరిధిలో పర్యటించారు. ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరును డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ, డీఈఈ జాహ్నవి శశాంక్‌లను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వల్నరబుల్ పాయింట్లను జీవీపీ సమర్థవంతంగా తొలగించాలని ఆదేశించారు.