ఎస్సీ కార్పొరేషన్ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మేడ్చల్,జూన్ 9 (విజయ క్రాంతి): ఎస్సీ కార్పొరేషన్ భూమిని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి శివారులో ఎస్సీ కార్పొరేషన్కు చెందిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 1991లో గుండ్లపోచంపల్లి శివారు సర్వే నంబర్ 509లోని 49 ఎకరాల 20 గుంటల భూమిని దళిత విద్యార్థుల సంక్షే మం, శిక్షణా కార్యక్రమాల కోసం ఎస్సీ కా ర్పొరేషన్కు కేటాయించారని తెలిపారు. తె లంగాణకు చెందిన ఎస్సీ విద్యార్థులకు ఉ ద్యానవన శిక్షణ అందించేందుకు ఉద్దేశించిన ఈ విలువైన భూమిని పరిరక్షించడం ప్రభు త్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములను కొందరు ప్రైవేట్ వ్యక్తులు గత ప్రభుత్వ అండదండలతో, ఆర్థిక బలాన్ని ఉపయోగించి అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. దళితుల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. 49 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక అందిన వెంటనే పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.‘
అన్యాక్రాంతం చేస్తున్న వారిలో ఎంత పెద్దవారు ఉన్నా సహించేది లేదు. ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని రక్షిస్తాం‘ అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని వెంటనే సర్వే నిర్వహించాలని, హద్దురాళ్లు, గేట్లు ఏర్పాటు చేసి భౌతిక స్వాధీన స్థితిపై నివేదిక అందించాలని ఆదేశించారు.
అనంతరం భూమిని పూర్తిస్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా బాధ్యతతోనే తాను ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. దళితుల ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు.బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ ప్రభావాలకు ప్రభుత్వం భయపడదని, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే మా లక్ష్యం.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఈ 49 ఎకరాల 20 గుంటల భూమి సాధారణ ఆస్తి కాదు. దీనిని కాపాడటం సామాజిక బాధ్యత‘ అని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల భూముల విషయంలో ఎవరైనా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడానికీ ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. ‘49 ఎకరాల 20 గుంటల్లో ఒక్క గజం భూమి పోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది‘ అని హెచ్చరించారు.
అదే సమయంలో ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతుల ప్రయోజనాలను కూడా పరిరక్షిస్తామని తెలిపారు. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు అవసరమైన దారులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, తమ ప్రభావాన్ని చూపాలని భావించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూ మంత్రికి కూడా నివేదిక సమర్పించి భూముల రక్షణకు అవసరమైన చర్యలు వేగవంతం చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, వీసీ అండ్ ఎండీ హనుమంత్ నాయక్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి బి. శ్రీధర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి. శంకర్, మేడ్చల్ ఆర్డీవో శ్యాంప్రసాద్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పద్మజ, మేడ్చల్ తహసీల్దార్ (ఇన్చార్జి) అనూష తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ స్థలం పరిశీలన
మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు. పక్కన మల్లారెడ్డి విద్యాసంస్థలు ఉన్నాయి. అక్కడ కొత్తగా రోడ్డు వేశారు. ఈ రోడ్డు మల్లారెడ్డి కాలేజీ తో పాటు రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఎస్సీ కార్పొరేషన్ స్థలం నుంచి మల్లారెడ్డి రోడ్డు వేశారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో మంత్రి లక్ష్మణ్ కుమార్ వచ్చి పరిశీలించారు. దీనిపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక్కడ గతంలో పానాది రోడ్డు ఉండేదని దానిపైన రోడ్డు వేశారని కొందరు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందిస్తూ తాను భూమి కబ్జా చేయాల్సిన అవసరం లేదని, తన విద్యాసంస్థకు ఇదివరకే రోడ్డు ఉందని తెలిపారు. కొత్తగా వేసిన రోడ్డు వల్ల వెనుకకు ఉన్న రైతులకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుందన్నారు.






