calender_icon.png 8 February, 2026 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో సమ్మెను విజయవంతం చేయాలి

08-02-2026 05:53:10 PM

ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్, ఓబి, కోల్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికులు సహా అన్ని విభాగాల కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఆదివారం ఖైరుగుడా ఓపెన్ కాస్ట్ ఓబి కాంట్రాక్టర్ (GRN యాజమాన్యం)  శ్రీనివాసనాయుడు కి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులను కట్టు బానిసలుగా మార్చేలా కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక వ్యతిరేకమని విమర్శించారు. సింగరేణిలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించి, బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఓబి కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు కార్మికులు గట్టి సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కొయ్యడా సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.