2029లో బహుజన రాజ్యాధికారం తథ్యం
టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్
సూర్యాపేట,(విజయక్రాంతి): 2029లో జరిగనున్న శాసన సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం రావడం తధ్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ అన్నారు. టిఆర్పీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, టిఆర్విస్ నాయకులు సాయి ఆధ్వర్యంలో 100 మంది యువకులు టీఆర్పీ పార్టీలో చేరుతున్న సందర్భముగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు టిఆర్పీ ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో టిఆర్పీ ఆధ్వర్యంలో రాజకీయ సునామీ రావడం ఖాయం అన్నారు. ఏడు దశాబ్దాల కాలంలో అగ్ర వర్ణాల పాలనలో బహుజనుల బ్రతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల పేరుతో అగ్రకులాలకు రిజర్వేషన్ లు కల్పిస్తూ బహుజన కులాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన ఆదరణ చూస్తుంటే యువతలో ఎంతో చైతన్యం వస్తుందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు యువత ఆకర్షితులై చేరడం హర్షనీయమన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసేలా యువకులు కంకణ బద్దులు కావాలని కోరారు. టిఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు.






