మైనారిటీ మహిళల సంక్షేమానికి కృషి
బీఆర్‌ఎస్‌కు విమర్శించే అర్హత లేదు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మేడ్చల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): మైనారిటీ, మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మంగళవారం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం అన్నారు.
స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు చేసే మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు.మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి కుటుంబం కోసమే ఖర్చు చేస్తారని, అందుకే ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు.రేవంత్ అన్నాక సహారా, మిస్కి నో కేలియే పథకం కింద మైనారిటీల జీవనోపాధికి అవసరమైన లక్ష రూపాయల విలువ చేసే మోపెడ్‌లను, స్వయం ఉపాధి కింద మహిళలకు కుట్టు మిషన్లను అందిస్తున్నామన్నారు.
మత సామాజిక మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయం, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్థిక చేయూత అందించడం ఎంతో గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని బీ ఆర్‌ఎస్ విమర్శించడంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లలో అమలు చేసిందా అని ప్రశ్నించారు. జిల్లాలోని 225 మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. తురక కాశి ముస్లిం వర్గాలకు కులవృత్తికి ఉపయోగపడే 60 వేల రూపాయల విలువ చేసే జనరేటర్ టూల్ కిట్లను 57 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, హౌస్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబుద్దిన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్, కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు వజ్రాష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పరమేశ్వర్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






