25 June, 2026 | 2:45 AM

క్రీడారంగంలో ములుగు ముందుండేలా కృషి

25-06-2026 01:36 AM

క్రీడాకారుల కేంద్ర ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది

స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్) జూన్ 24 (విజయక్రాంతి): క్రీడా రంగంలో ములుగు జిల్లా ముందుండేలా కృషి చేస్తామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ములుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, క్రీడాకారులకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకంగా నిలుస్తుందని, క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

బుధవారం ములుగు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  ఒలింపిక్ డే రన్  2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా మారుమూల ప్రాంతం అయినప్పటికీ క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందుతోందన్నారు. జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు, క్రీడాకారులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశ విదేశాల్లో ములుగు ఖ్యాతిని చాటుతున్నారని తెలిపారు. పేదరికం, వెనుకబడిన పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని పిల్లల్లో ఉన్న ప్రతిభ అపారమని, వాలీబాల్, ఆర్చరీ వంటి క్రీడల్లో ములుగు జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన చరిత్ర ఉందన్నారు.

క్రికెట్ సహా ఇతర క్రీడల్లో కూడా విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్టేడియం ఏర్పాటు కోసం వచ్చిన ప్రతిపాదన మేరకు రూ.4 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయించామని, భవిష్యత్తులో అవసరమైన అదనపు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు క్రీడలపై పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచించారు.

ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న క్రీడలో విజయం సాధించి ములుగు జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని,తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ మంత్రి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఈవో సిద్ధార్థ రెడ్డి, డి.ఎస్.పి రవీందర్,  జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పగడాల వెంకటేశ్వర రెడ్డి, పీడీలు, పిఈటి లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.