16 June, 2026 | 2:38 AM

విద్యార్థులే సమాజానికి ఆస్తి

16-06-2026 12:45 AM
  1. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సీఎం అల్పాహారం, పాలు 
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  3. రంగారెడ్డి జిల్లా నజీబ్‌నగర్ కేజీబీవీలో 65వ జన్మదిన వేడుకలు
  4. హాజరైన మంత్రి పొన్నం 

మొయినాబాద్, జూన్ 15 (విజయక్రాం తి): విద్యార్థులు సమాజానికి నిజమైన సంపద అని, వారి ఉజ్వల భవిష్యత్తే రేపటి తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తన 65వ జన్మదిన వేడుకలను వేసవి సెలవుల అనంత రం పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజైన సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండలం నజీబ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థుల మధ్య జరుపుకున్నా రు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

భట్టి విక్రమార్క విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి తన పుట్టినరోజు ఆనందాన్ని పంచుకున్నారు. అనంత రం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా విద్యార్థినులు చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం తక్షణమే స్పందిస్తూ పలు హామీలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం సోలార్ గీజర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కేజీబీవీ పాఠశాలలో రద్దీని తట్టుకునేందుకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ’యంగ్ ఇండియా వసతి పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తాం. పాఠశాలలు తెరిచిన మొదటి రోజే రాష్ట్రంలోని సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికా హారంతో కూడిన సీఎం అల్పాహారం, పాలు అందించే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది’ అని అన్నారు. 

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు: మంత్రి పొన్నం

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సర్కారు బడులను ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా అధునాతన వసతులతో తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల రవాణా ఇబ్బందులను గమనించామని, ఈ పాఠశాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించి రవాణా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.