‘నిద్రమత్తు’లో టౌన్ ప్లానింగ్..!
- నాగోల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల ‘జోరు’
- టీఎస్ -బీపాస్ నిబంధనలు గాలిలోకి..
- ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 15 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ తీసుకువచ్చిన ‘టీఎస్-బీపాస్’ విధానాన్ని కొందరు అక్రమార్కులు లూప్హోల్గా మార్చుకుంటున్నారు.జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు, వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నా.. అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నివాస అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేస్తూ వాటిని కమర్షియల్గా మారుస్తున్నారు.
రాత్రింబవళ్లు జోరుగా పనులు..
నాగోల్ సర్కిల్ పరిధిలోని కుంట్లూర్ 51వ డివిజన్, శాంక్టస్ స్కూల్ సమీపంలో మరియు కాశిబుగ్గ సీతారామాంజనేయ స్వామి రోడ్డులో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ షెడ్డు నిర్మాణాలు సాగుతున్నాయి. మరోవైపు, పెద్ద అంబర్పేట్ 52వ డివిజన్ పరిధిలోని హయత్ నగర్ - పెద్ద అంబర్పేట్ సర్వీస్ రోడ్డులో గల ప్రసిద్ధ సంగం హోటల్, ఎస్‌ఎన్‌ఆర్ కళా కన్వెన్షన్ పక్కన, అలాగే ఓఆర్‌ఆర్ సమీపంలోని తాజా హోటల్ పక్కన గ్రీన్జోన్, ఎఫ్టీఎల్ పరిధులను సైతం లెక్కచేయకుండా, ఎలాంటి ఎన్‌ఓసీ లు లేకుండానే పునాదులు పడుతుండటం గమనార్హం.
నిబంధనల ఉల్లంఘనలు ఇవే..
పక్క భవనాలకు, రోడ్డుకు మధ్య కచ్చితంగా వదలాల్సిన కనీస స్థలాన్ని (సెట్బ్యాక్) అస్సలు వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. దీనివల్ల పక్క గృహాల వారికి గాలి, వెలుతురు రాకుండా పోతోంది. కమర్షియల్ భవనాల్లో బేస్మెంట్ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా షాపులుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో తీవ్ర ట్రాఫిక్ జామ్లకు కారణం కానుంది.భారీ షెడ్లు, కన్వెన్షన్ల పక్కన నిర్మిస్తున్న భవనాల్లో కనీస అగ్నిమాపక రక్షణ నిబంధనలు పాటించడం లేదు. అత్యవసర ద్వారాలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
నిబంధనలను తుంగలో తొక్కి..
నిజానికి ‘టీఎస్- బీపాస్’ కింద స్వయం ధృవీకరణతో అనుమతి పొందిన తర్వాత, ఆ ప్లాన్ ప్రకారమే నిర్మిస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం సదరు నిర్మాణాలను కూల్చివేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలు, ఎఫ్టీఎల్ ఆక్రమణలపై ’హైడ్రా’ వంటి కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థలతో ‘జీరో టాలరెన్స్‘ విధానాన్ని అమలు చేస్తోంది. ఇటువంటి తరుణంలో స్థానిక అధికారులు ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాగోల్ సర్కిల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై తక్షణమే విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






