calender_icon.png 6 December, 2024 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల బాట పడుతున్న విద్యార్థులు

15-10-2024 02:38:58 AM

విలాసవంతమైన జీవితం, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు

ఆన్‌లైన్ బెట్టింగ్స్‌తో భవిష్యత్ నాశనం

తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచిస్తున్న పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఉన్నత చదువులు చదివి తమ పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు కాయకష్టం చేసి చదివిస్తుంటే.. కొందరు పిల్లలు మాత్రం చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. విలాసవంతమైన జీవితం కోసం కొందరు.. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో డబ్బులు కోల్పోయి మరికొందరు నేరాల బాట పడుతున్నారు.

దీంతో పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులకు పోలీసుల బేడీలు పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్లలో కాలేజీ విద్యార్థులే అధికంగా ఉంటున్నారని ఓ పోలీసు అధికారి చెప్పడం గమనార్హం.

సిటీతో పాటు శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకొని ఎక్కువగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గుడ్డిగా నమ్మకుండా వారి కదలికలపై దృష్టి సారించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్య చోటుచేసుకున్న ఘటనలు..

* చంపాపేటలో నివాసముండే బొంత అనిల్ అనే వ్యక్తి పీజీ పూర్తి చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడి లోన్ యాప్‌ల నుంచి భారీగా అప్పులు తీసుకున్నాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక దొంగగా అవతారమెత్తాడు. ఈ క్రమంలో ఈ నెల 4న ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడకు చెందిన భారతమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 

* ఏపీకి చెందిన ఓ విద్యార్థి ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చి, తన తోటి స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో విపరీతంగా అప్పులు చేశాడు. అనంతరం వాటిని తీర్చే మార్గం కనబడక గత నెలలో యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి మరీ ఆమె నగలను తస్కరించాడు. అనంతరం పోలీసులకు చిక్కి ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు.

విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి..  

హైదరాబాద్ నగరం ఓ అందమైన కలల ప్రపంచం. దేశ, విదేశాల నుంచి ఎందరో విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఒకరిని చూసి మరొకరు విలాసవంతంగా జీవించాలని కలలు కనడం సహజమే. బుద్ధిగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కొందరు విద్యార్థులు భావిస్తుంటే.. మధ్య తరగతి జీవితం నచ్చక చోరీలు చేసి అయినా సరే విలాసంగా బతకడానికి మరికొందరు విద్యార్థులు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కడంతో చివరికి కటకటాలపాలవుతున్నారు. కన్నవారికి శోకం మిగులుస్తున్నారు. 

లోన్ యాప్‌ల వాయిదాలు చెల్లించడానికి..

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు సర్వస్వం ఉన్నట్లే. మొదట స్నేహితులతో సరదాగా అలవాటైన ఆన్‌లైన్ బెట్టింగ్స్ చివరకు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తు న్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్స్ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయి.

మొదట్లో పెట్టిన పెట్టుబడులకు లాభాలు చూపిస్తూ విద్యార్థులను ఆకర్షించడంతో, ఆ తర్వాత అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ ఆడుతున్నారు. అలా రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి చివరికి నష్టపోయి, అప్పులు తీర్చలేక ఆన్‌లైన్ యాప్‌లలో లోన్లు తీసుకుంటున్నారు. అనంతరం వాటిని తీర్చే మార్గం లేక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.