5 August, 2026 | 7:24 PM

వరి, పత్తి పంటల్లో నానో యూరియా, నానో డీఏపీ సమర్థతపై క్షేత్ర స్థాయి పరిశీలన

05-08-2026 06:50 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), ఆధ్వర్యంలో కన్నెపల్లి మండలంలోని జంకాపూర్ పోలంపల్లి గ్రామాలలో వరి, పత్తి పంటల్లో నానో యూరియా, నానో డీఏపీ సమర్థత అంచనాపై క్షేత్ర స్థాయి పరిశీలన (On-Farm Trial) నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు నానో ఎరువుల వినియోగం ద్వారా పోషక వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, పంట ఎదుగుదల దిగుబడిని మెరుగుపరచడం వంటి అంశాలను రైతులకు వివరించారు.

వరి పంటలో నాట్లు నాటే ముందు నానో డీఏపీతో వేర్ల ముంపు (Root Dip) విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అలాగే పత్తి పంటలో సిఫారసు చేసిన షెడ్యూల్ ప్రకారం నానో యూరియా, నానో డీఏపీ ఆకులపై పిచికారీ చేసే విధానాన్ని రైతులకు క్షేత్రస్థాయిలో చూపించారు. నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం, సమతుల్య పోషక నిర్వహణ పాటించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో డా. ఎన్. మహేష్, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కేవీకే బెల్లంపల్లి, శ్రీమతి పి. సాద్వి, ఎస్‌ఎంఎస్ (ఎక్స్‌టెన్షన్), కేవీకే బెల్లంపల్లి, వ్యవసాయ అధికారి శ్రీ ప్రశాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ సంతోష్ రైతులు పాల్గొన్నారు.