నీ ధైర్యం తగలెయ్య!
హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు
మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ప్రేమించిన యువతితో మాట్లాడించాలంటూ ప్రాణాలకు తెగించి హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడి ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారావుపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు శుక్రవారం సాయంత్రం మోరంచ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ ఎక్కాడు.
తాను మనసు పడిన యువతి తన ఫోన్ నంబర్ను బ్లాక్ చేసిందని, ఆమెతో వెంటనే మాట్లాడించాలని, లేనిపక్షంలో కిందకు దిగేది లేదని భీష్మించాడు. అయితే టవర్ పైన యువకుడు ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రాజుకు నచ్చజెప్పి క్షేమంగా కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేదని, నీ ధైర్యం తగలెయ్య.. అంటూ ఈ ఘటన చూసిన పలువురు విసుక్కున్నారు.




