కేర్‌లో కిడ్నీ మార్పిడి విజయవంతం
- రోగికి కొత్త జీవితం ప్రసాదించిన హాస్పిటల్స్ వైద్యులు
- 60 ఏళ్ల భర్తకి కిడ్నీ దానం చేసిన భార్య
హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): రక్త గ్రూపులు సరిపోకపోవడంతో పాటు యాంటీబాడీలు అధికంగా ఉండటం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న 60 ఏళ్ల ఉపాధ్యాయుడికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు క్లిష్టమైన ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. రెండేళ్లుగా డయాలసిస్‌పై ఆధారపడుతున్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయడంతో కొత్త జీవితం లభించింది.
మూడేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ)తో బాధపడుతున్న ఆయన గత రెండేళ్లుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. తరచూ ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఉపాధ్యాయుడిగా తన విధులను కొనసాగించారు.కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అండ్ యూరాలజీ డాక్టర్ సుశాంత్ కులకర్ణి మాట్లాడుతూ, రక్త గ్రూపులు సరిపోకపోవడం, యాంటీబాడీలు అధికంగా ఉండటం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఇది క్లిష్టమైన కిడ్నీ మార్పిడి.
నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్ బృందాల సమన్వయం, ముందస్తు ప్రణాళికతో మార్పిడిని విజయవంతంగా నిర్వహించగలిగాం అన్నారు.కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ డాక్టర్ జె. అల్ రంగనాథ్ మాట్లాడుతూ, రెండేళ్లుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్న రోగికి ఈ కిడ్నీ మార్పిడి సాధారణ, స్వతంత్ర జీవితానికి తిరిగి చేరుకునే అవకాశం కల్పించింది.
కిడ్నీ తిరస్కరణను నివారిస్తూనే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడం ఈ కేసులో కీలకంగా నిలిచింది అన్నారు.కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ, రక్త గ్రూపు సరిపోకపోయినా భర్తకు కిడ్నీ ఇచ్చేందుకు భార్య ముందుకు రావడం గొప్ప విషయం. వైద్య నిపుణుల సమన్వయంతో క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆధునిక చికిత్స అందించి కిడ్నీ మార్పిడిని విజయవంతం చేయగలిగాం అన్నారు.






