22 August, 2026 | 3:36 AM

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

22-08-2026 01:02 AM

చౌటుప్పల్ , ఆగస్టు 21:  చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జనరల్ డైరీ (జీడి) ఎంట్రీలు, సీసీటిఎన్‌ఎస్ పనితీరు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, వివిధ రిజిస్టర్లు, రికార్డులు, సిబ్బంది పనితీరు, ఇతర కార్యాచరణ అంశాలను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్లో రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార విధానాలను సమీక్షించారు.

అన్ని చట్టబద్ధమైన రికార్డులు, రిజిస్టర్లు, డిజిటల్ ఎంట్రీలను ఖచ్చితంగా, క్రమబద్ధంగా, ఎప్పటికప్పుడు నవీకరించి నిర్వహించాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు, సందర్శకుడితో మర్యాదగా, ఓర్పుతో, గౌరవప్రదంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుభూతితో స్వీకరించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈయన వెంట డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.