పాలిటెక్నిక్ వ్యవస్థను కాపాడాలి
జీవో 97 రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యార్థులు, బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
నంగునూరు, ఆగస్టు 21 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న జీవో97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట వద్ద విద్యార్థులు, బీఆర్‌ఎస్వీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నంగునూరు మండల కోఆర్డినేటర్ తప్పెట పర్శరాములు ఆధ్వర్యంలో సిద్దిపేట - హనుమకొండ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సేవ్ పాలిటెక్నిక్ ..సేవ ఎస్ బీటీఈటి అంటూ నిరసన వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యా శాఖ నుంచి తొలగించి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (పీపీపీ) పరిధిలో చేర్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.శక్తి శాఖలోకి పాలిటెక్నిక్ విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ టీ.వివేక్ తన బృందంతో కలిసి నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ రాస్తారోకో లో బిఆర్‌ఎస్వి జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, నాయకులు దాసరి రమేష్,గఫూర్, రంగు చింటూ గౌడ్,ఇమ్రాన్, చింటు గౌడ్, రాజు, అనిల్, సాయిరెడ్డి, భాను, వెంకటేష్, సోహేల్, రఘు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






