క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం
జిల్లా జడ్జి కే.మురళీమోహన్
మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి, ఇరు పార్టీలను ఒప్పించి జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పవచ్చని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మురళీమోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మురళీమోహన్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని న్యాయమూర్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను గుర్తించడం, ఇరు వర్గాలతో సమన్వయం చేసి కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎక్సైజ్ కేసులు, సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ వస్తుందనే ఉద్దేశంతో కేసుల పరిష్కారంలో అలసత్వం వహించకుండా, రాజీ పడదగిన కేసులను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పోలీసు, న్యాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జడ్జి సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా జిల్లా పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రాజీ పడదగిన పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ప్రజలు, పోలీసు, న్యాయ వ్యవస్థల సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, తద్వారా కోర్టులపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు త్వరిత న్యాయం అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు శాలిని షాకెళ్ళి, స్వాతి మురారి, ఏ. కృష్ణ తేజ్, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.






