తెలంగాణ గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రాంరెడ్డి నియామకం
రంగారెడ్డి, మే 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన రాష్ట్ర గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా మాడ్గుల మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సూదిని రాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాంరెడ్డి ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవంతో పాటు, క్షేత్రస్థాయిలో పంచాయతీ రాజ్ వ్యవస్థపై ఆయనకు ఉన్న పట్టును గుర్తించి ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన అందిస్తున్న సేవలకు ప్రతిఫలంగా ఈ పదవి దక్కిందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం రాంరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ భారీ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో తలెత్తే వివాదాలను పరిష్కరించడంలో మరియు పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
సూదిని రాంరెడ్డి నియామకం పట్ల మాడ్గుల మండలంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులు మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.
ట్రిబ్యునల్ ప్రాధాన్యత..
గ్రామ పంచాయతీల్లో సర్పంచుల తొలగింపు, అనర్హత వేటు వంటి కీలక అంశాలపై విచారణ జరిపి తీర్పునిచ్చే అధికారం ఈ ట్రిబ్యునల్కు ఉంటుంది. రాంరెడ్డి రాకతో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం వేగవంతం కానుందని భావిస్తున్నారు.






