17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం
వైభవంగా గురు పౌర్ణమి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలో వెలసిన శ్రీ గణపతి దత్తాత్రేయ సుప్రభాత శ్రీ శిర్డీ సాయిబాబా దేవాలయంలో 17వవార్షికోత్సవం, గురుపౌర్ణమి మహోత్సవాలను ఈ నెల 9న గురువారం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్,సభ్యులు తెలిపారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహక కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 5 గంటలకు కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభమై గణపతి పూజ, పుణ్యాహవాచనం, సాయిబాబా విశేష అభిషేకం, పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక అర్చనలు, హోమాలు, మంగళహారతులు నిర్వహించనున్నారు.
అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళహారతి అనంతరం భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం, సాయంత్రం భజనలు, సత్సంగాలు, సాయిబాబా మహిమలను వివరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి శేజ్ హారతితో ఉత్సవాలు ముగియనున్నాయి. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక పార్కింగ్, తాగునీరు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
భక్తులు సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరారు.ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు, స్థానిక యువకులు విస్తృతంగాసహకరిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తాయని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై సాయినాథుని కృపకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.






