వేసవిలో సరదాగా నేర్చుకుందాం
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎండా కాలం సెలవులు వచ్చాయంటే చాలు విద్యార్థులు సరదాగా ఆటపాటలతో గడిపేందుకే ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల సృజనకు పదును పెట్టి, వారి ఆసక్తులకు మెరుగులు దిద్దేందుకు ప్రత్యేకంగా వేసవి శిబిరాలను ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ పాఠశాలల్లో కొన సాగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోనే తొలిసారిగా వివిధ అంశాల్లో శిక్షణ తరగతులు, బాల కేంద్రం లో పిల్లలకు సాంప్రదాయ వాయిద్యాలు, శాస్త్రీయ నృత్య శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాల్లో భాగంగా ఈ వేసవి శిబిరాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ శిబిరాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే పీఎంశ్రీ పాఠశాలలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదివిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ శిబిరాల్లో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు.
ఎస్పీ అఖిల్ మహజాన్ ఆలోచన మేరకు పిల్లలు వేసవి కాలంలో సెల్ ఫోన్లకు అతుక్కుపోవడం, సరదాగా వాగులు, చెరువుల్లో స్నానాలకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం లాంటి ఘటనల నుంచి దారి మళ్లించేందుకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. బాల కేంద్రంలో సైతం పిల్లలకు సాంప్రదాయ వాయిద్యాలు, శాస్త్రీయ నృత్యలు, హస్త కళల పట్ల శిక్షణ ఇస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షా బాల కేంద్రాన్ని ఎప్పటికప్పుడు సందర్శించి శిక్షణపై ఆరా తీస్తున్నారు.
నైపుణ్య శిక్షణతో పాటు విద్యార్థులకు ప్రత్యేకంగా స్నాక్స్ కూడా అందిస్తున్నారు. ఈ శిబిరాల నిర్వహణ, ఖర్చుల కోసం విద్యాశాఖ ప్రతేకంగా నిధులను అందిస్తోంది. ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కుట్లు, సంగీతం, గాత్రం, నృత్యం, క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ తదితర అంశాల్లో శిక్షణ నిస్తున్నారు. ప్రత్యేకంగా నలుగురు శిక్షకులను శిక్షణనిస్తున్నట్లు పీఎంశ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి తెలిపారు.
బీర్కూర్ వార్ వెంకటేష్






