21 May, 2026 | 2:43 AM

నారంగ్ రాజీనామా

21-05-2026 12:31 AM

రంగులు బయటపడేనా? 

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సునీల్ నారంగ్ 

పర్సంటేజీ వ్యవహారంతో పరిహాసమవుతున్న టాలీవుడ్ 

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామ ర్స్ (టీఎస్‌ఎఫ్‌సీసీ) అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఈ మేర కు ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి, ఆమోదించింది. సునీల్ నారంగ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ అధ్యక్ష పదవి నుంచి విముక్తి కల్పించినట్టు టీఎస్‌ఎఫ్‌సీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో  చర్చనీయాంశంగా మారింది. 

నిర్మాతల తీరే కారణం.. 

‘పెద్ది’ సినిమా రిలీజ్ ముందే పర్సంటేజీ విధానంపై ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న సంగతి తెలి సిందే. మరోవైపు నిర్మాతలు ససేమిరా అం టూ, ‘పెద్ది’ రిలీజ్ తర్వాతే తుది నిర్ణయం అంటూ మొడికేస్తున్నారు. ఈ వ్యవహారమే సునీల్ నారంగ్ రాజీనామాకు దారి తీసింది.

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా బహుముఖ పాత్ర పోషిస్తున్న సునీల్ నారంగ్ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మల్టీ ప్లెక్సులతోపాటు సింగిల్ స్క్రీన్లు కూడా నడుస్తున్నాయి. ఇటీవలి పర్సంటేజీ వివా దంలో ఎగ్జిబిటర్ల కోసం గళం విప్పి న వాళ్లలో సునీల్ నారంగ్ ముందు వరుసలో నిలిచారు. ఈ క్రమం లో నాగవంశీ, మైత్రి రవిశంకర్ వంటి నిర్మాతలు సునీల్ నారంగ్‌ను టార్గెట్ చేశారంటూ విమర్శనాత్మక కథనాలు పలు మాధ్యమాల్లో వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే సునీల్ నారంగ్ సైతం ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ నాగవంశీపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తర్వాత జరిగిన ఫిలిం ఛాంబర్ సమావేశం సైతం నారంగ్ వర్సెస్ నాగవంశీ అన్నట్టుగానే జరిగిందన్న విష యమూ బయటకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పర్సంటేజీ వ్యవహారానికి తెరదించాల్సిన నిర్మాతలు.. వ్యక్తిగతంగా తన ను లక్ష్యం చేయడం నచ్చకే నారంగ్ రాజీనా మా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

ఏదేమైనా నారంగ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం, ఈ తతం గం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. మంగ ళవారం రాత్రి బాగా పొద్దుపోయాక నారంగ్ తన రాజీనామా లేఖను ఛాంబర్ ప్రతినిధులకు పంపించడాన్ని బట్టి నిర్మాతలకు నారంగ్ ఎంతలా టార్గెట్ అవుతున్నారో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదనేది వారు వినిపిస్తున్న వాదన. 

‘స్టార్స్’ ఎటువైపు? 

సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లంతా ఒక అవగాహనకు వచ్చారంటూ ఒక ప్రెస్‌నోట్ వైరల్ కావ డం.. అది అధికారికం కాదంటూ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు స్పష్టం చేయడం.. ఓ డ్రామా నడిచింది. ఆ కాసేపటికే నారంగ్ రాజీనామా చేయడం గమనార్హం. కొందరు కార్యవర్గ సభ్యుల మెప్పు కోసం నిర్ణయాలు తీసుకోవాలని తన పై ఒత్తిడి తెస్తున్నారని, ఆ ఒత్తిళ్లకు తలొగ్గి తాను పనిచేయలేనని, తన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదని సునీల్ ఈ సందర్భంగా తేల్చిచెప్పారని టాక్.

ఛాంబర్లో నిర్ణ యాలన్నీ ఏకాభిప్రాయంతో జరగడం లేదని.. అందుకే తక్షణం తనను అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారట సునీల్. తన స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు శేఖర్ లేదా విజేందర్ పేర్లను సూచించారని సమాచారం. ఇంత జరిగిన తర్వాత కూడా పరిశ్రమ పెద్దలు, స్టార్ హీరోల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. ఇప్పటికైనా పెద్దలు కల్పించు కొని తమ రంగును బయట పెడతారా..? నవ్విపోదురు గాక నాకేటి.. అన్నట్టు, తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయానికి బలం చేకూర్చుతారా..? చూడాలి!