సూపర్ స్పెషాలిటీ వైద్యం
ఉత్తర తెలంగాణ ప్రజలకు వరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్‌పై ఆధారపడుతున్న వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఖమ్మం జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు ఇకపై అందుబాటులోనే అత్యున్నత వైద్య సేవలు అందనున్నాయి. ఒకప్పుడు నేరస్తులు కారాగార శిక్ష అనుభవించే ‘వరంగల్ సెంట్రల్ జైలు’ ప్రదేశంలోనే ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 1,371 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేసి త్వరలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టింది. ఈ ఆసుపత్రి తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రముఖ ప్రభు త్వ వైద్య కేంద్రంగా నిలవనుంది.
వరంగల్ నగరంలోని హెల్త్ సిటీ పరిధిలో సుమారు 56 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. మొత్తం 2,018 పడక లు, అత్యవసర విభాగాలకు ప్రత్యేక బ్లాకుల ఏర్పాటు చేస్తున్నారు. 35 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ సర్జరీలకు అనుకూల సదుపాయాలతో శస్త్రచికిత్స విభాగం ఏర్పాటు చేస్తున్నారు.
వైద్య సేవల విభాగాలు
ఈ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలతో పాటు అత్యున్నత స్థాయి ప్రత్యేక చికిత్సలు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కార్డియాలజీ (గుండె వైద్యం), కార్డియాక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ (క్యాన్సర్ చికిత్స), ఎముకల వైద్యం, ట్రామా కేర్ సెంటర్, అత్యవసర వైద్య విభాగం, పిల్లల వైద్యం, మహిళల ప్రత్యేక విభాగం, ఐసీయూలు, డిజిటల్ హెల్త్ మానిటరింగ్, స్మార్ట్ ఐసీయూ వ్యవస్థ, ఆన్లైన్ రోగి రికార్డులు, హైటెక్ ల్యాబ్లు, అత్యాధునిక ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్, టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి రానున్నా యి. రోగులతో వచ్చే బంధువులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
250 గదులతో ధర్మశాల, విశ్రాంతి కేంద్రాలు, భోజనశాలలు, పార్కింగ్, తాగునీటి సదుపాయం, ప్రత్యేక లిఫ్టులు, క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది కోసం 186 నివాస గృహాలు, ప్రత్యేక హాస్టళ్లు, సిబ్బంది, విశ్రాంతి కేంద్రాలు నిర్మిస్తున్నారు. వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మసీ సిబ్బం ది, భద్రతా సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, సహా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు, ఉచిత శస్త్రచికిత్సలు, తక్కువ ఖర్చుతో పరీక్షలు, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రి ద్వారా మెడికల్ విద్యార్థులకు ఆధునిక శిక్షణ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు, పరిశోధనా అవకాశాలు, వైద్య రంగంలో కొత్త టెక్నాలజీల వినియోగం పెరిగే అవకాశం ఉంది.
నిర్మాణ పనులు వేగవంతం
ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆసుపత్రి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న విభాగాలతో జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు.






