సర్టిఫికెట్లకు సప‘రేటు’!
- ప్రైవేటు విద్యాసంస్థల చిల్లర దందా
టీసీలు, ఇతర సర్టిఫికెట్ల కోసం వసూళ్లు
ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల నిర్వాకం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి నిలు వెత్తు నిదర్శనం ఇంతకుమించి ఉండదేమో! తమ సంస్థలో రెండు, మూడేళ్లు చదువుకున్నారన్నా జాలి, కనికరం లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పీడించుకుతినడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నాయి. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి సర్టిఫెకెట్ల పేరిట కూడా ఇష్టారీతిగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.
వేలకు వేలు రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేసింది చాలక.. టీసీలు, ఇతర సర్టిఫికెట్ల జారీలో కూడా కక్కుర్తికి తెరతీశారు. నగరంలోని పలు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యాసంస్థలో ఒక్కో విధంగా వసూళ్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పదోతరగతి పూర్తున విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరడానికి, ఇంటర్మీడియట్ పూర్తున విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరడానికి టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, మెమోలు తప్పనిసరి కావాలి.
ఆ సర్టిఫికెట్ల కోసం ఆయా విద్యాసంస్థలకు వెళితే అక్కడ వాటి కోసం ఫీజులు వసూలు చేస్తుండడాన్ని చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగుతింటున్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్ల కోసం ఫీజులు అడగడంతో ఆశ్చర్యపోతున్నారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నిస్తుండగా, మరి కొందరు చేసేదేమీ లేక అడిగిన డబ్బులు సమర్పించుకుంటున్నారు.
టీసీ బుక్కు రూ.500లే!
ప్రైవేటు పాఠశాలలు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కార్యాలయం నుంచి టీసీ పుస్తకాలను పొందాల్సి ఉంటుంది. అందుకోసం విద్యాశాఖకు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో టీసీ బుక్కులో 100 లీవ్స్(పేజీలు) ఉంటాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా విద్యాసంస్థలు అవసరమైన మేర బుక్కులు తీసుకుంటాయి. కొన్ని ప్రైవేటు కాలేజీలు ప్రత్యేకంగా ముద్రించుకుంటున్నాయి. మొత్తంగా ఒక్క పేజీ రూ.5గా ఉంటే.. విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
కొన్ని కాలేజీల్లో రూ.1500 వరకు లాగుతున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి రశీదుల్లేని దందా అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్దందంగా కొనసాగుతోంది. ఈ వసూళ్ల పర్వంపై విద్యార్థి సంఘాల నాయకులు విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చూసీచూడనట్లుగా వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. టీసీలకు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేటు విద్యాసంస్థలు వసూళ్లు చేస్తున్నాయంటే అధికారుల అండదండలతోనేనని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ రకమైన దోపిడీ చేసిన విద్యాసంస్థలను గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉన్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






