5 June, 2026 | 2:51 AM

రైతుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలి

05-06-2026 01:50 AM

మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రైతులకు నష్టం కలిగించే విధంగా కాకుండా, రైతు సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి అన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో నకిలీ విత్తనాల విక్రయాలు సాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా రైతులకు నష్టం కలిగించే విధంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా మని ఆమె హెచ్చరించారు.

ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కంపెనీలు ఉత్పత్తి చేసిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, సీలు లేకుండా, రసీదు ఇవ్వకుండా విత్తనాలు విక్రయించకూడదని విత్తనాల విక్రయ డీలర్లను కోరారు.  రెక్కల కష్టం పై ఆధారపడి జీవించే అన్నదాతకు మోసం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ ఐ రవి కిరణ్, విత్తనాల డీలర్లు పాల్గొన్నారు.