30 August, 2026 | 6:37 PM

తుడుం దెబ్బ మండల అధ్యక్షుడిగా పంద్రం సురేష్

30-08-2026 05:36 PM

వాంకిడి, (విజయ క్రాంతి): ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) వాంకిడి మండల నూతన అధ్యక్షుడిగా సోనాపూర్ సర్పంచ్ పంద్రం సురేష్ ఎన్నికయ్యారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపాతి అరుణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్‌కుమార్ అధ్యక్షతన నూతన మండల కమిటీ ఎన్నికలు నిర్వహించారు.

మండల అధ్యక్ష పదవికి పంద్రం సురేష్‌తో పాటు మాడవి భీమ్‌రావు, మాడవి బండు, కొడప జగన్, సోయం సంజీవ్ పోటీ చేశారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా పంద్రం సురేష్ అత్యధిక ఓట్లు సాధించి భారీ మెజారిటీతో మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పంద్రం సురేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆదివాసీల హక్కుల కోసం తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు మాడవి మధు, తుడుం దెబ్బ సలహాదారు కనక ప్రభాకర్, జిల్లా, మండల నాయకులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.