సర్వేలు పక్కాగా నిర్వహించాలి
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న డిజిటల్ జనరల్ క్రాఫ్ట్ ఎస్టిమేషన్ సర్వేను లోపాల్లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్వేపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
సర్వే ప్రక్రియలో ప్రతి అధికారి పూర్తి అవగాహనతో వ్యవహరించాలని కలెక్టర్ సూచిం చారు. పొరపాట్లు లేకుండా సర్వే చేయడం వల్ల పంట దిగుబడి రేట్ల అంచనాలు పారదర్శకంగా వెలువడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే ఈ డిజిటల్ సర్వే అమలులో ఉందని, దీని ద్వారా ఖచ్చితమైన పంట దిగుబడి వివరాలు లభిస్తాయన్నారు.
మొత్తం 68 పంటలపై ఈ సర్వే నిర్వహించాలని, రైతుల సమస్యలను తెలుసుకొని వారికి సరైన అంచనాలు అందించడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. అలాగే, ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా రైతులు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందేలా అధికారులు వెంటనే సర్వే చేసి, నివేదికలను సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి జీవరత్నం, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






